High Level Meeting on Fire Accidents in Hyderabad : సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్‌లోని దక్కన్‌మాల్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంతో ఫైర్ సేఫ్టీపై ప్రభుత్వం దృష్టి సారించింది. అగ్నిప్రమాద నివారణ అనుమతుల్లేని భవనాలపై చేపట్టాల్సిన చర్యలపై హైదరాబాద్ బీఆర్కేభవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సీఎస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ భేటీలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో.. భారీ భవనాలకు అగ్నిమాపక రక్షణ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించారు.
Fire Accidents in Hyderabad : పురపాలక, పోలీసులు, అగ్నిమాపక అధికారులు సమన్వయంతో పని చేసి.. సకాలంలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఆసుపత్రులు, పాఠశాల భవనాలు, పెట్రోల్ బంకులు, గ్యాస్ గోదాములు, వ్యాపార, వాణిజ్య భవనాలు, ఎత్తైన అపార్టుమెంట్లపైనా దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అగ్నిమాపక ఆడిటింగ్ జరగాలన్నారు. 1999లో రూపొందించిన ఫైర్ సేఫ్టీ చట్టాలను మార్చేందుకు తగు ప్రతిపాదనలను పంపించాలని మంత్రి కేటీఆర్ అధికారులను కోరారు. ఆధునిక వాహనాలు, అగ్నిమాపక యంత్రాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సికింద్రాబాద్ ఘటనలో భారీ ప్రాణనష్టం కలగకుండా చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగాన్ని కేటీఆర్ అభినందించారు. దక్కన్‌మాల్ అగ్ని ప్రమాదంలో గల్లంతైన ముగ్గురి కుటుంబాలకు తలా రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గురువారం నుంచి ఆ భవనం కూల్చివేత..: భారీ అగ్ని ప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై సిఫార్సు చేసేందుకు ఉన్నతస్థాయి అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. నామమాత్రంగా సమీక్ష నిర్వహించలేదని.. అగ్నిప్రమాదాలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోబోతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ దక్కన్‌మాల్ భవనం కూల్చివేత ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం అవుతుందని మంత్రి తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా భవనాన్ని కూల్చివేస్తామని స్పష్టం చేశారు.
ఇటీవల సికింద్రాబాద్ దక్కన్ మాల్‌లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి ఆచూకీ గల్లంతైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వారి మృతదేహాలు లభించలేదు. ఈ ముగ్గురి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు.