తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత విజయ డెయిరీ లాభాల బాటలో పయనిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మేరకు మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మంత్రి తలసాని ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పాడి రైతులకు ప్రభుత్వం తరపున అందించే 4 రూపాయల ప్రోత్సాహం కోసం 28 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ప్రైవేటు డెయిరీలకు దీటుగా విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాలు జరుగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అదే తరహాలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి మాంసం ధరలను నియంత్రించాలని అధికారులకు సూచించారు. గోపాల మిత్ర బకాయి వేతనాలు ప్రతి నెల మొదటి వారంలోనే చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. మొదటి విడత గొర్రెల పంపిణీలో డీడీలు చెల్లించిన 28వేల మందికి సీఎం అదేశాలతో త్వరలోనే వాటిని అందిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ బ్రాండ్ పేరుతో మాంసం విక్రయాలు జరిపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేస్తున్నామన్న ఆయన.. ప్రజల అవసరాలకు సరిపడా చేప పిల్లల ఉత్పత్తిని రాష్ట్రంలోనే పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
ఇదీ చదవండి: రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు ముఖ్యమంత్రి