తెలంగాణవ్యాప్తంగా ప్రధానమైన దేవాలయం బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్. ముఖేశ్ అంబానీ భార్య నీతు అంబానీ ఈ టెంపుల్‌కి పెద్ద భక్తురాలు. ఆమె చాలా సార్లు ఈ గుడికి వచ్చారు. జులై 13న కల్యాణం, 14న రథోత్సవం ఉంటుంది. ఆలయానికి వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రావాలి. రాజకీయాలకతీతంగా అందరి సహకారం అవసరం. దైవ భక్తుడు కేసీఆర్... మన సంస్కృతి, సాంప్రదాయలను పెంపొందించే విధంగా పెద్దఎత్తున నిధులు కూడా మంజూరు చేసిండు.
--- తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి
వచ్చే నెల 13న బల్కంపేట(Balkampeta)లోని ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ప్రకటించారు. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో దేవాదాయ శాఖ, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఆర్ అండ్ బీ, హెల్త్, పోలీస్, ఎలక్ట్రికల్ తదితర శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా అమ్మవారి కల్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించినట్లు మంత్రి చెప్పారు. ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశించారని తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అమ్మవారి కల్యాణాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
13న కల్యాణం... 14న రథోత్సవం
జులై 12న ఎదుర్కోళ్లు, 13న అమ్మవారి కల్యాణం, 14న రథోత్సవం నిర్వహిస్తామని మంత్రి వివరించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. ఆలయానికి వచ్చే, రథోత్సవం నిర్వహించే రహదారులను వెంటనే మరమత్తు చేపట్టాలని జోనల్ కమిషనర్ ప్రావీణ్యను ఆదేశించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్య నిర్వహణ, శానిటైజేషన్ చేపట్టాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలన్నారు. మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
లక్ష వాటర్ ప్యాకెట్స్...
నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేయాలని విద్యుత్ అధికారులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ఆదేశించారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అమ్మవారి ఆలయాన్ని సర్వాంగసుందరంగా అలంకరించాలని సూచించారు. అమ్మవారి కల్యాణ ఉత్సవాల ప్రారంభం నుంచి ముగిసే వరకు నీటి సరఫరా జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులకు తెలిపారు. భక్తులకు పంపిణీ చేసేందుకు లక్ష వాటర్ ప్యాకెట్స్‌ను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
అన్నదాన కార్యక్రమాలు...
భక్తుల కోసం పలు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసే అన్నదాన కార్యక్రమాలకు అవసరమైన సహకారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాలలో ఎలాంటి డ్రైనేజీ లీకేజీలు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. దొంగతనాలు, ఈవ్ టీజింగ్ వంటి చర్యల నియంత్రణపై నిఘా ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను కోరారు. అవసరమైన ప్రాంతాలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
వైద్య శిబిరాలు...
మూడు రోజుల పాటు ఆలయ పరిసరాలలో భక్తుల రాకపోకలు ఉంటాయని, ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టి ప్రజలు, వాహనదారులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని ట్రాఫిక్ పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు. భక్తులకు వైద్య సేవలను అందించేందుకు మూడు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, సరళ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ, ఈవో అన్నపూర్ణ, కల్చర్ డైరెక్టర్ హరికృష్ణ, డీసీ వంశీ, వాటర్ వర్క్స్ డైరెక్టర్ కృష్ణ, వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ భాస్కర్, ఆర్ అండ్ బీ ఈఈ శ్రీనాథ్, ట్రాన్స్ కో డీఈ నెహ్రూ నాయక్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ యుగంధర్, ఆర్డీఓ వసంత కుమారి, సమాచార శాఖ ఇంజినీర్ రాధాకృష్ణ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సురేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స ధరలు ఇవే..