భాగ్యనగరంలో బోనాల సందడి మొదలై వారం దాటింది. గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో ప్రారంభమైన బోనాలు.. వచ్చే నెల 8 వరకు కొనసాగనున్నాయి. ఈ నెల 25న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల ఉత్సవం జరగనుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టుచీర సమర్పించనున్నారు.
ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి.. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టుచీర సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు 25న జరగబోయే బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారికి సమర్పించనున్న చీర తయారీ పనులను.. అమ్మవారి ఆలయంలో మంత్రి శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
నిష్ఠగా చీర తయారీ
10 మంది చేనేత కార్మికులు ఎంతో నిష్ఠతో ఉంటూ చీర తయారీ పూర్తయ్యే వరకు నిరంతరం శ్రమిస్తారని మంత్రి తలసాని వివరించారు. బోనాల రోజు అమ్మవారికి పట్టు చీర సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, కార్పొరేటర్ సుచిత్ర, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, పద్మశాలి సంఘం అధ్యక్షులు జయరాజ్, రచ్చ నాగరాజ్, నాగమూర్తి, హరి తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్త: Bonalu: జులై 11న గోల్కొండ, 25న లష్కర్ బోనాలు
ఇదీ చదవండి: Etela: పాదయాత్రలో నాపై దాడికి కుట్ర: ఈటల