హైదరాబాద్ మసాబ్ ట్యాంకు పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాఠోడ్ సమావేశమయ్యారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న 35,500 అంగన్‌వాడీ కేంద్రాలకు విజయ డెయిరీ పాల సరఫరాకు సంబంధించి విధివిధానాలపై చర్చించారు. విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి కావల్సిన అన్ని చర్యలను చేపట్టాలని అధికారులకు తెలిపారు.
20 లక్షల లీటర్లు సరఫరా
వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు పాలు సరఫరా చేయడమే కాకుండా.. ఐసీడీఎస్ కేంద్రాలకు కావల్సిన 20 లక్షల లీటర్లు సరఫరా చేయడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రస్తుతం ఐసీడీఎస్ కేంద్రాలకు అవసరమైన పాలల్లో 5.5 లక్షల లీటర్లు విజయ తెలంగాణ డెయిరీ సరఫరా చేస్తుంది. మిగతా లీటర్ల పాల సరఫరాకు అవసరమైన సిబ్బంది నియామకం ద్వారా పాల సేకరణకు కావలసిన సామర్థ్యం సమకూర్చుకుంటుందని మంత్రి తెలిపారు.
అందుబాటులో ఉంచేందుకు
విజయ డెయిరీ బ్రాండ్ ప్రోత్సాహం కోసం ప్రత్యేక మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం కల్పిస్తూ.. పాల ఉత్పత్తులు అందుబాటులో ఉంచేందుకు చేపట్టిన కార్యక్రమాలను మంత్రి సత్యవతి రాఠోడ్ అభినందించారు. అంగన్‌వాడీలకు అవసరమైన పాల సరఫరాకు కావాల్సిన అన్ని రకాల హంగులు, సామర్థ్యం ఉన్న విజయ డెయిరీ సమాఖ్యను ఒక నోడల్ ఏజన్సీగా గుర్తించడానికి కావలసిన ఆదేశాలు ఇవ్వాలని మంత్రి సత్యవతి రాఠోడ్‌ను తలసాని కోరారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య, విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : భర్త, కుమార్తె ప్రాణాల్ని తీసిన ఫేస్బుక్ స్నేహం