Talasani on double bed room houses: రాష్ట్రంలోని పేద ప్రజలు అన్ని వసతులున్న సొంత ఇంట్లో సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ బస్తీల్లోని పేదలు గొప్పగా జీవించాలనేది ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. హైదరాబాద్ ఖైరతాబాద్ డివిజన్లో ఉన్న ఇందిరానగర్లో నిర్మించిన 210 రెండు పడక గదుల ఇళ్లు కేటాయించేందుకు లబ్ధిదారులను గుర్తించే కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు.
Indiranagar double bed room houses: ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు బస్తీల్లో నివసించే స్థానికుల మధ్యనే అర్హులను గుర్తించారు. అయితే లబ్ధిదారులు పూర్తిస్థాయిలో రాకపోవడంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఇళ్ల కోసం లక్షలమంది పేదవారు కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నారని కానీ ఇక్కడ మాత్రం ఇళ్లు కేటాయించిన్నప్పటికీ ఎందుకు రావడం లేదని మంత్రి ప్రశ్నించారు. వారం రోజుల్లో లబ్ధిదారులు రాకపోతే కేటాయించిన ఇళ్లను రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు.
సీఎం కేసీఆర్ మంచి ఆశయంతో రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తున్నారు. పేదవారు సంతోషంగా సొంత ఇంట్లో ఉండాలనే ఉద్దేశంతో కట్టినాం. ఒక్కో ఇల్లు కోటి రూపాయల విలువ ఉంటుంది. పక్కనే ఐమాక్స్ థియేటర్, సెక్రటేరియట్ ఉంది. ఎమ్మార్వో అందరికీ తెలియజేశారు. మీ ఇళ్లు చూసుకుని మీరు రాలేరా? లబ్ధిదారులు అందరూ కూడా రావాలి కదా. ఇక్కడ ఉన్నపేర్లలో బస్తీ వాళ్లు ఉన్నారా లేదా మీరే చెప్పాలి? బస్తీ వాళ్లు కాకపోతే మీరే తెలియజేయండి.
- తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి
అర్హులైన వారికే కేటాయిస్తాం: ఎమ్మెల్యే దానం
MLA Dhanam nagender: అర్హులైన వారికి ఇళ్లు ఇవ్వాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసిన వారం రోజుల్లోనే వారికి ఇళ్లను కేటాయిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి, ఆర్డీఓ వసంత, ఖైరతాబాద్ తహసీల్దార్ అన్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇళ్లు లేని వారికి రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పేదవారి కలను నెరవేరుస్తున్నాం. లబ్ధిదారులను గుర్తించి వారంలోగా అందరికీ కేటాయిస్తాం.
-దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే