పేదవర్గాలకు మేలు చేస్తున్నందుకే సీఎం కేసీఆర్ మీద జాతీయ పార్టీలకు కోపం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud News) అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు తమకు కావాలని ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. తెరాస ప్లీనరీ విజయవంతం కావడంతో ప్రతిపక్షాలకు కడుపుమంటగా మారిందని మంత్రి ధ్వజమెత్తారు. ప్లీనరీతో తెరాస మరో 20ఏళ్లపాటు అధికారంలో ఉంటుందనే భరోసా కలిగిందన్నారు. మంత్రి కేటీఆర్ సమర్ధతను గుర్తించే ఫ్రాన్స్ ఆహ్వానించిందన్నారు. ఇందులో పైరవీలు ఉంటాయా అని మంత్రి ప్రశ్నించారు.
దళిత బంధు పథకాన్ని ఓర్వడం లేదని.. ఎన్నికలు ఉండగా ఇంకా బహిరంగ చర్చ ఎందుకని శ్రీనివాస్‌గౌడ్(Srinivas Goud News) ప్రశ్నించారు. హుజురాబాద్‌లో కచ్చితంగా గెలుస్తామని.. త్వరలోనే ఉద్యోగ నియమాకాల ప్రక్రియ మొదలవుతుందని మంత్రి వెల్లడించారు..
'కేసీఆర్ అంటే ఎందుకు కోపం అంటే బీసీ జనగణనకు తీర్మానం చేశారు. దేశవ్యాప్తంగా ఎంతమంది బీసీలు ఉన్నారని తెలిస్తే అది ఏమవుతుందో అని భయం. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేశారు. అది అమలయితే ఎట్ల అయితదో అని భయం. దళితబంధు తీసుకొచ్చిండు. రేపు దళితబంధుతో ఆర్థికంగా డెవలప్ అయితే అని భయం. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం అయింది. అది అమలయితే ఎలా అని భయం. ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేశారు. ఎట్లా అని భయం. మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచాలని తీర్మానం చేశారు ఎట్లా అని భయం.'
-శ్రీనివాస్ గౌడ్, మంత్రి
బీసీ గణన జరిగి వెనకబడిన వర్గాలు అభివృద్ది చెందుతాయనే కాంగ్రెస్, భాజపాలకు కేసీఆర్ అంటే భయమని మంత్రి(Srinivas Goud News) ఎద్దేవా చేశారు. అందుకే కేసీఆర్ మీద పగపడుతూ కక్షకడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తమ పార్టీ ఎలా ఉండాలో వారే నిర్ణయించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
'పేదవర్గాలకు మేలు చేస్తున్నందుకే కేసీఆర్ మీద కోపం. జాతీయ పార్టీలు బీసీ జనగణన గురించి మాట్లాడవు. అధికారం కోసం మా ఓట్లు కావాలి. కానీ మా జనాభా, మా స్థితిగతుల లెక్కలు అవసరం లేదా? బీసీలకు ఒక్క మంత్రిత్వ శాఖ ఎందుకు ఇస్తలేరు?'
-శ్రీనివాస్ గౌడ్, మంత్రి
హైదరాబాద్‌లో తెరాస ప్లీనరీ (TRS PLENARY) సోమవారం జరిగింది. ఈ వేదికపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం, రాష్ట్ర అభివృద్ధిపై (Kcr at Plenary) ప్రసంగించారు. తెలంగాణ వస్తే చీకట్లు అలుముకుంటాయని, అభివృద్ధి కుంటుపడుతుందని దుష్ప్రచారం చేశారని గుర్తుచేశారు. రాజీలేని పోరాటంతో తెలంగాణ సాధించుకుని... అలుపులేకుండా అభివృద్ధి బాటలో పరుగెడుతున్నామన్నారు. దళితబంధు ఉద్యమం దేశాన్ని తట్టి లేపుతుందని కేసీఆర్ (KCR) ధీమా వ్యక్తం చేశారు. పటేల్, పట్వారీ వ్యవస్థను ఎన్టీఆర్ రద్దు చేసినట్లే వీఆర్వో (VRO) వ్యవస్థను తీసి పడేశామన్నారు. రాబోయే ఏడేళ్లలో బడ్జెట్ల ద్వారా మొత్తం 23 లక్షల కోట్ల ఖర్చు చేస్తామని చెప్పారు. దళితబంధు వృథా కాదని ఆర్థిక పరిపుష్ఠికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: KCR Speech at Plenary: 'రాజీలేని పోరాటంతో సాధించుకున్నాం.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాం'