Srinivas Goud on Ambedkar Birth Anniversary : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును భారత పార్లమెంటుకు పెట్టాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వస్తున్నప్పటికీ.. కేంద్రం పట్టించుకోవడం లేదని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఆక్షేపించారు. సీఎం కేసీఆర్.. తెలంగాణ సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టి గౌరవించారని కొనియాడారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్స్ హాలులో కళా ప్రదర్శనలను మంత్రి పరిశీలించారు.
కళాకారులు రాష్ట్రవ్యాప్తంగా కళాప్రదర్శనులు ఇవ్వాలి : ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం సచివాలయం సమీపంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహం నిర్మించిందని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. అంబేడ్కర్ జయంతి రోజున విగ్రహం ఆవిష్కరిస్తున్న శుభ సందర్భంగా సాంస్కృతిక శాఖ కళాకారులు ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. ఆయన చరిత్ర, అన్ని కులాలు, మతాలకు అందించిన సేవలను మరోసారి ప్రజలు స్మరించుకునే విధంగా అర్థమయ్యే భాషలో పాటల రూపంలో.. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు రాష్ట్రవ్యాప్తంగా కళా ప్రదర్శనలు ఇవ్వాలని కోరారు.
Srinivas Goud on Ambedkar Birth Anniversary Celebrations in Telangana : భారత రాజ్యాంగంలో ఆర్టికల్ - 3 ప్రకారం చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సూచించిన మార్గం ద్వారానే ఉద్యమ నాయకుడు కేసీఆర్ పోరాట స్ఫూర్తితో స్వరాష్ట్రం తెలంగాణ కల సాకారమైందని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, అంబేడ్కర్ చరిత్రపై వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక సారథి కళాకారులు విస్తృత ప్రచారం నిర్వహించాలని.. అందుకోసం కొత్తగా పాటలు, సాహిత్యం రూపొందించాలని ఆదేశించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కలలు తెలంగాణ సాకారం చేసిందని.. యావత్ భారతదేశానికి కచ్చితంగా ఆదర్శంగా నిలవనున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. అలాగే విగ్రహావిష్కరణ అనంతరం నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, కళాకారులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: