Minister Srinivas Goud held a review meeting on CM Cup games : రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎన్నడూ లేని విధంగా.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చీఫ్ మినిస్టర్ కప్-2023 పేరుతో పెద్ద ఎత్తున పోటీలు నిర్వహిస్తోంది. సీఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాల నిర్వహణపై సచివాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా స్థాయిలో ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగే క్రీడా పోటీలను జయప్రదం చేయాలన్న మంత్రి.. ఆయా జిల్లాకు చెందిన మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, అధికారులు సమన్వయం చేసి క్రీడాపోటీలను విజయవంతం చేయాలని తెలిపారు.
ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే రాష్ట్ర స్థాయి పోటీలను వైభవోపేతంగా నిర్వహించాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. సీఎం కప్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను జీహెచ్ఎంసీలోని స్పోర్ట్స్ విభాగం, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. మండల స్థాయిలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను గుర్తించి.. వాటిని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ పర్యవేక్షణలోకి తీసుకురావాలని క్రీడా శాఖ అధికారులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు.
సీఎం కప్‌లో 18 క్రీడాంశాలకు సంబంధించిన వివిధ క్రీడా సంఘాల అసోసియేషన్ ప్రతినిధులు.. జిల్లా స్థాయిలో క్రీడా పోటీలను విజయవంతం చేయడంలో కీలక భూమిక పోషించాలని అన్నారు. 33 జిల్లాల్లో క్రీడా అసోసియేషన్ల ప్రతినిధులు సమర్థవంతంగా పని చేసి సీఎం కప్-2023ను విజయవంతం చేయాలని మంత్రి.. సంఘాల నాయకులను కోరారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ల ఛైర్మెన్లు రసమయి బాలకిషన్, ఆంజనేయ గౌడ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, జూలూరి గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
యువ క్రీడాకారుల గుర్తింపే లక్ష్యంగా..: గ్రామీణ స్థాయి నుంచే యువ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా సీఎం కప్-2023 పేరుతో పోటీలను ప్రారంభించింది. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ పోటీలను జరుపుతున్నారు. దాదాపు 10,000 మంది క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలను నిర్వహించనుంది.
ఇవి మే 15న ప్రారంభమై.. 31న ముగియనున్నాయి. చివరి రోజైన మే 31న అంగరంగ వైభవంగా ముగింపు వేడుకలను నిర్వహించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీటిలో విజయం సాధించిన విజేతలకు రూ.లక్ష నగదు బహుమతి, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.75,000, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.50,000 బహూకరించనున్నారు.
ఇవీ చదవండి: