ఈమధ్య కాలంలో కురిసిన అకాల వర్షాలకు రైతులు ఎంతో నష్టపోయారు. రైతులను ఆదుకోవాలంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. రైతుల పేరిట రాజకీయం చేయవద్దని అన్నారు. నాలుగేళ్లలో రైతుల కోసం కాంగ్రెస్ ఎంపీలు ఎన్ని దీక్షలు చేశారని ప్రశ్నించారు.
అకాల వర్షాల గురించి నాలుగు రోజుల ముందు నుంచే ప్రభుత్వం అప్రమత్తం చేసిందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వర్షాలు కురిసిన 24 గంటల్లోపే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లాలో పర్యటించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో దెబ్బతిన్న పంటలను అంచనా వేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించామని చెప్పారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. వివిధ ప్రాంతాల్లో ఆయా ఎమ్మెల్యేలు పంట నష్టం జరిగిన వ్యవసాయ క్షేత్రాలు సందర్శించి రైతులకు భరోసా కల్పిస్తున్నారని వెల్లడించారు.
కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేసే రాజకీయ దీక్షలను రైతులు గమనిస్తారని, సమస్య ప్రభుత్వం దృష్టికి ఒక ప్రజాప్రతినిధిగా కోమటిరెడ్డి లేదా మరొకరు తీసుకురావడం తమ బాధ్యత అని మంత్రి అన్నారు. కానీ, రాజకీయ దురుద్దేశాలతో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే అలోచన సబబు కాదని హితవు పలికారు. ప్రభుత్వం రైతులు, వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చిందని, వ్యవసాయ అనుకూల విధానాల కారణంగా దేశంలోనే అగ్రగామిగా కొసాగుతుందని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రభుత్వ చర్యల వల్ల ఈ ఏడాది యాసంగి సీజన్‌లో 56.44 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగవుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. రైతు బంధు పథకం, రైతు బీమా, ఉచిత కరెంటు, సాగు నీటి వనరుల కల్పన ద్వారా రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరగడంతోపాటు ప్రతి ఏటా వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయని తెలిపారు.
'దేశంలో సగటు ఉత్పత్తిలో రాష్ట్రం ప్రథమ స్థాయిలో ఉంది. తెలంగాణ వరి ధాన్యం కొనమని కేంద్రం తేల్చిచెబితే ఒక్క కాంగ్రెస్ పార్టీ నేత కూడా ఎందుకు ప్రశ్నించలేదు..? ఎందుకు దీక్షలు చేయలేదు..? అకాల వర్షాలతో వచ్చిన పంట నష్టంపై రాజకీయం చేయడం దురదృష్టకరం. మీ గత ప్రభుత్వ పాలనలో రైతుల పడ్డ గోస గుర్తు చేసుకోవాలి' అని ఎంపీ కోమటిరెడ్డికి మంత్రి నిరంజన్ రెడ్డి హితవు పలికారు.
ఇవీ చదవండి: