Satyavati Rathod Comments on Vande Bharat train : బీజేపీ ప్రభుత్వం ఆలోచన విధానాలు, అమలు.. ధనికులకే తప్ప పేదవాళ్లకు ఉపయోగకరంగా లేవని మంత్రి సత్యవతి రాఠోడ్ ఆరోపించారు. విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రం వందే భారత్ వంటి వేగవంతమైన ట్రైన్లు ప్రారంభించి ఎవరికి లాభం చేకూరుస్తున్నారని ప్రశ్నించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును వర్చువల్‌గా ప్రారంభించడం హర్షించదగ్గ విషయమే అయినా.. ఇది సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న రైలు కాదన్నారు. ప్రజల సమస్యలు తీర్చడంపై దృష్టి పెట్టకుండా కొత్త పేర్లు, కొత్త నినాదాలు, ప్రచారాలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారన్న మంత్రి.. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని తెలిపారు. 18వ రైలు ప్రారంభోత్సవానికి ఇంత హంగు, ఆర్భాటాలు, ప్రచారాలు ఎందుకో చెప్పాలన్నారు.
హై స్పీడ్ ట్రైన్ ప్రారంభించి అదే అభివృద్ధి అని చెప్పుకోవడం.. ఇదేనా మోదీ మార్క్ డెవలప్‌మెంట్ అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టుగానీ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కానీ జాతీయ హోదా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించకపోవడం బాధాకరమని తెలిపిన ఆమె.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించాలని కొన్ని దశాబ్దాలుగా ఆందోళనలు కొనసాగుతున్నా వాటిని మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలంటే వేగంగా వెళ్లే వందే భారత్ రైలు మంజూరు చేశారని ఎద్దేవా చేశారు. ములుగు జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినా అది గతి లేకుండా అయిపోయిందని పేర్కొన్నారు. వర్సిటీ ఏర్పాటైతే ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. తెలంగాణ పరిధిలోని ఏడు మండలాలను హడావిడిగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆమె ధ్వజమెత్తారు.
వందే భరత్ రైలు రాజమండ్రిలో 2 నిమిషాలు ఆగితే.. అదే వరంగల్‌లో 1 నిమిషం టైం ఇచ్చి వివక్ష చూపుతున్నారన్నారు. వరంగల్ జిల్లా రైల్వే స్టేషన్ దేశంలో 64వ రద్దీగా ఉండే స్టేషన్, అంతేకాకుండా ఉత్తర దక్షిణ ప్రాంతాలకు ఈ స్టేషన్ నుంచే రైళ్ల రాకపోకలు కొనసాగుతాయి. అలాంటి వరంగల్ జిల్లా రైల్వే స్టేషన్‌లో కూడా 2 నిమిషాలు వందే భరత్ రైలు ఆగే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏదో మేలు చేస్తున్నారని నటించే మోదీ, బీజేపీకి రాబోయే రోజుల్లో ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని ఆమె అన్నారు.
ఇవీ చదవండి: