రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 12 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలు వచ్చే ఏడాది జూన్ లోపు పూర్తి కావాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. గురుకులాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు పునః ప్రారంభం నేపథ్యంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నూతన భవన నిర్మాణాలు, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, పురోగతిని సమీక్షించారు.
44 గురుకులాల నిర్మాణం కొనసాగుతోందన్న అధికారులు... అందులో 21 గురుకులాల నిర్మాణం పూర్తి కాగా, మిగిలిన 23 భవనాల నిర్మాణం వివిధ దశల్లో ఉందని తెలిపారు. నిర్మాణం పూర్తైన భవనాల ప్రారంభోత్సవాలకు త్వరలో ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కొత్తగా వచ్చే భవనాల్లో విద్యార్థులకు వేడినీటి వసతిని వీలైనంత త్వరగా కల్పించాలని రెడ్కో ప్రతినిధులను మంత్రి సత్యవతి రాఠోడ్ కోరారు.
పునఃప్రారంభమైన గురుకులాలు
తెలంగాణలో సంక్షేమ గురుకులాలు(Telangana Gurukul Schools Reopened) ఇవాళ పునఃప్రారంభమయ్యాయి. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గత విద్యా సంవత్సరంలో వీటిని మూసేశారు. తాజాగా గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా సొసైటీలు కార్యాచరణ ప్రకటించాయి. ఈ నెల 21 నుంచి ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు గురుకులాల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమవుతుందని, విద్యార్థుల రక్షణ, ఆరోగ్యం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్‌రాస్.. ప్రాంతీయ, జోనల్, జిల్లా సమన్వయకర్తలకు గురువారం ఆదేశాలు జారీచేశారు. ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది నూరుశాతం పాఠశాలలకు హాజరుకావాలని ఆదేశించారు. పాఠశాల/కళాశాలకు వచ్చే విద్యార్థులకు కరోనా పరీక్ష తప్పనిసరి కాదని స్పష్టంచేశారు. సాధారణ శరీర ఉష్ణోగ్రత సహా ఇతర లక్షణాలు పరిశీలించాలని సూచించారు. సిలబస్ పూర్తిచేయాలనే భావనతో విద్యార్థులపై ఒత్తిడి పెంచవద్దని, విద్యార్థులకు పాఠ్యాంశాలపై ఉన్న అవగాహనను అంచనా వేస్తూ.. అందుకు అనుగుణంగా బోధన కొనసాగించాలని తెలిపారు. చాలాకాలం తరువాత విద్యార్థులు వస్తున్నందున విద్యాలయాల్లో ఒత్తిడిలేని వాతావరణం కల్పించాలని బోధన సిబ్బందికి సూచించారు.
ఇదీ చదవండి: TS Eamcet : ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల