అంకితభావంతో పనిచేస్తే అందుకు తగిన గుర్తింపు కచ్చితంగా ఉంటుందని.. దానికి అంగన్ వాడీ టీచర్ చంద్రకళ నిదర్శనమని మంత్రి సత్యవతి రాఠోడ్ కొనియాడారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ విపత్కర సమయాల్లోనూ కర్తవ్యమే ప్రత్యక్ష దైవంగా భావించి, తన పరిధిలోని ప్రజలందరికీ క్రమం తప్పకుండా.. అంగన్వాడీ నిత్యావసర సరుకులు అందించిన చంద్రకళను మంత్రి సన్మానించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, టేకులగూడెం గ్రామానికి చెందిన చంద్రకళకు శుక్రవారం మంత్రి తన నివాసంలో పూలమాల వేసి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఆమెకు పోచంపల్లి పట్టుచీర పెట్టి గౌరవించారు. వైరస్‌కు భయపడకుండా అందరికీ పోషకాహారాన్ని అందించాలన్న దృఢ సంకల్పంతో ఆమె అందించిన సేవలు అందరికీ స్ఫూర్తి దాయకమని మంత్రి కొనియాాడారు.
ఉత్తమ అంగన్వాడీ కార్యకర్తగా ఎంపికైన చంద్రకళ.. ఈ నెల 31న ప్రధాని చేతుల మీదుగా పురస్కారం అందుకోనున్నారు. అదేవిధంగా జాతీయ మహిళా కమిషన్ చేతుల మీదుగా 'కొవిడ్ ఉమెన్ వారియర్ ది రియల్ హీరోస్' పురస్కారం స్వీకరించనున్నారు.
ఇదీ చదవండి: నాకోసం ఎదురు చూసేవాళ్లే గుర్తొస్తుంటారు..!