Sabitha Indra Reddy's review on tenth class exams: పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న సందేహాలను భయాలను తొలగించి వారిలో మనోధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత అధ్యాపకులకు, తల్లిదండ్రులకు ఉందన్నారు.
పెద్ద సంఖ్యలో విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నందున.. పారదర్శకంగా, ఆటంకం లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా 2,652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. పరీక్షల నిర్వహణలో జిల్లా కలెక్టర్లు ముఖ్య భూమిక పోషించాలని మంత్రి పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున, పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కోరారు. విద్యార్థులకు సుహుృద్భావ వాతావరణంలో పరీక్షలు రాసేలా సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పరీక్షల సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ఆదేశించారు. హాల్టికెట్లను సంబంధిత పాఠశాలలకు ఇప్పటికే పంపటం జరగడంతో పాటు విద్యార్థులే స్వయంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి పరీక్షా పేపర్లను 11 నుంచి 6కు కుదించడం జరిగిందని, సైన్స్ పరీక్షా రోజున భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రంకు సంబంధించి ప్రశ్నా పత్రాలు, జవాబు పత్రాలను విడివిడిగా అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు తాము చదివిన పాఠశాలలకు దగ్గరలోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే సౌకర్యం కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. పరీక్షల కోసం పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు దేవసేన, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: