తెలంగాణ సమీకృత సచివాలయ సముదాయం హరిత భవనంగా మారనుంది. ఈ మేరకు సచివాలయ భవనాన్ని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నమోదు చేసుకుంది. పర్యావరణంపై అతి తక్కువ ప్రభావం ఉండేలా పలు ప్రత్యేకతలతో సచివాలయ భవనాన్ని నిర్మిస్తున్నామన్న... రహదార్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (prashanth reddy)... సాధారణ భవనాలతో పోలిస్తే 30 నుంచి 50 శాతం వరకు ఇంధనం, 20 నుంచి 30 శాతం వరకు నీటి వినియోగం ఆదా అవుతుందని చెప్పారు.
ధారళంగా వెలుతురు, సగానికి పైగా గ్రీన్ కవర్, వాననీటి సంరక్షణ ఏర్పాట్లు, డ్రిప్-స్ప్రింకర్ ఏర్పాట్లు ఉంటాయన్నారు. వెలుతురు, కార్బన్ డయాక్సైడ్ పర్యవేక్షణ, ఏసీ నియంత్రణ లాంటి ఆటోమేషన్ సాంకేతికతలను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. భవనంలో దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
స్థిరత్వం ఎక్కువగా ఉండేలా భవనాన్ని డిజైన్ చేసి నిర్మిస్తున్నామని ప్రశాంత్ రెడ్డి అన్నారు. పూర్తిగా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న ఆయన... కొవిడ్ మహమ్మారి సమయంలో నిబంధనలకు లోబడి నిర్మాణం జరుగుతోందని చెప్పారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తున్న సచివాలయ భవనంలో పనిచేసే వారి పనితీరు కూడా మెరుగ్గా ఉండేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
స్థానికంగా లభించే వస్తువులతోనే నిర్మాణం జరుగుతోందని, రీ సైక్లింగ్ ఉత్పత్తులను కూడా వినియోగిస్తున్నట్లు ప్రశాంత్ రెడ్డి చెప్పారు. సచివాలయం తరహాలోనే 28 సమీకృత కలెక్టరేట్లను కూడా ఐజీబీసీ నిబంధనలకు లోబడి నిర్మిస్తున్నట్లు ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి తెలిపారు. సచివాలయ ప్రాజెక్టులో భాగస్వామ్యమైన ఇంజినీర్లు, ఆర్కిటెక్టులకు ఇప్పటికే పలు దఫాలు అవగాహన కల్పించినట్లు... ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే పలు ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు హరితభవనాలుగా మారాయని ఆయన వెల్లడించారు.
ఇదీ చూడండి: srinivas goud: 'అభివృద్ధి చేసే పార్టీకి.. అభివృద్ధిని అడ్డుకునే పార్టీకి పోటీ'