Ravichandran Ashwin Wife : టీమ్ఇండియా టెస్టు జట్టులో కీలకంగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ అనుహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా మూడో టెస్టు డ్రాగా ముగియగానే విలేకరుల ముందుకు వచ్చి ఈ నిర్ణయం ప్రకటించాడు. అయితే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అశ్విన్ భార్య ప్రీతీ నారాయణన్ కూడా స్పందించింది. తమిద్దరి మధ్య ఉన్న అనుబంధం, అశ్విన్ సాధించిన విజయాల గురించి వివరించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత ఆనందంతో కన్నీరు పెట్టుకున్నామని తెలిపింది. మెల్‌బోర్న్, గబ్బా టెస్టుల్లో విజయం, టీ20ల్లోకి అశ్విన్ పునరాగమనం చేసిన తర్వాత కూడా భావోద్వేగానికి గురయ్యామని తెలిపింది. క్రికెట్ పై అశ్విన్ ఎంత నిబద్ధతతో ఉండేవాడో వివరించింది.
"రెండ్రోజుల నుంచి నాకు దిక్కు తోచడం లేదు. ఏం చెప్పాలా? అని ఆలోచిస్తున్నా. నా ఫేవరెట్ క్రికెటర్‌కు సంఘీభావం తెలుపాలా? లేక తను నా జీవిత భాగస్వామి అనే కోణంలో స్పందించాలా? లేంటే ఓ అభిమానిగా మాట్లాడాలా? అని తర్జనభర్జన పడ్డాను. అశ్విన్ రిటైర్‌మెంట్ ప్రకటించాక, అతడు సాధించిన చిన్న, పెద్ద క్షణాలు, విజయాలు గుర్తుకొచ్చాయి. గత 13-14 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. భారీ విజయాలు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు ఉన్నాయి. ఇప్పుడు మా ఇంట్లో అంతా నిశ్శబ్దం.
డియర్ అశ్విన్, క్రికెట్ కిట్ బ్యాగ్ ఎలా పట్టుకోవాలో తెలియని నేను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టేడియాల వరకు నిన్ను అనుసరించాను. మిమ్మల్ని చూస్తూ నేర్చుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు పరిచయం చేసిన ఈ ప్రపంచం నాకు గౌరవాన్ని అందించింది. క్రికెట్‌లో రాణించేందుకు మీరు ఎంత కృషి, క్రమశిక్షణతో మెలిగారో నేను చూశాను. అవార్డులు, రికార్డులు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌లు, ప్రశంసలు, రికార్డులు వేటినీ పట్టించుకోకుండా నైపుణ్యాలను మీరు నిరంతరం పదును పెట్టుకున్నారు. అద్భుతంగా సాగిన మీ అంతర్జాతీయ కెరీర్‌కు బై చెప్పేశారు. అంతా మంచే జరుగుతుంది. మీపై ఉన్న ఉన్న భారం దించుకోండి. మీ కుటుంబానికి సమయాన్ని కేటాయించండి. రోజంతా మీమ్స్ షేర్ చేస్తూ ఉండండి. మన పిల్లల క్రమశిక్షణను పర్యవేక్షించండి" అని ప్రీతి అశ్విన్ రాసుకొచ్చింది. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు అశ్విన్ వెల్లడించాడు. అయితే సిరీస్ మధ్యలోనే అశ్విన్ ఇలా సడన్‌గా ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాడని అభిమానుల్లో అనుమానాలు మెదులుతున్నాయి.
2024లో భారీగా పెరిగిన బీసీసీఐ ఆదాయం - ఐపీఎల్ వ్యూవర్‌షిప్‌తో రూ.4200 కోట్ల లాభం!
త్వరలోనే బీసీసీఐకి కొత్త కార్యదర్శి, కోశాధికారి - ఆ రోజే ఎన్నికలు!