రాష్ట్రంలోని పేదవారికి ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే యుద్ధప్రాతిపదికన వైద్య మౌళిక సదుపాయాల అభివృద్ధికి సీఎం శ్రీకారం చుట్టారని తెలిపారు. ఎర్రమంజిల్‌లోని రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంలో పలువురు ఉన్నతాధికారులు, ఆర్కిటెక్ట్‌లతో మంత్రి సమావేశమయ్యారు. ఆ శాఖ ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన పలు ఆస్పత్రులు, మెడికల్, నర్సింగ్ కళాశాలల నిర్మాణాల డిజైన్ ప్లాన్స్‌ను అధికారులతో కలిసి పరిశీలించారు.
వరంగల్‌లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, హైదరాబాద్ నగర నలువైపులా 4 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, నిమ్స్ ఆస్పత్రి విస్తరణకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించారు. సంగారెడ్డి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, రామగుండం ఏరియాల్లో 8 కొత్త వైద్య కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న విషయం తెలిసిందే. అలాగే సంగారెడ్డి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేట, జోగులాంబ గద్వాల, బాన్సువాడలో నిర్మించనున్న 14 నర్సింగ్ కాలేజీల నిర్మాణ డిజైన్లను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రి పరిశీలించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా డిజైన్లలో స్వల్ప మార్పులు సూచించారు. తర్వాతి సమావేశం నాటికి డిజైన్ ప్లాన్స్‌ను ముఖ్యమంత్రికి సమర్పించేందుకు సిద్ధం చేయాలని ఆర్కిటెక్ట్‌లను ఆదేశించారు.
ఇదీ చూడండి: Srinivas Goud News: 'కేసీఆర్ అంటే జాతీయ పార్టీలకు అందుకే కోపం'