Prashanth Reddy on Rahul: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆయన తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీశారని ఆక్షేపించారు. గన్ పార్కులో ఉన్న అమరుల స్తూపానికి నివాళులు అర్పించని రాహుల్... నిర్మాణంలో ఉన్న స్మృతి చిహ్నాన్ని సందర్శించడం అమరుల త్యాగాలను, ప్రజలను అవమానించినట్లేనని మండిపడ్డారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చూస్తే జాలేస్తోందన్న ప్రశాంత్ రెడ్డి... పట్టపగలు డబ్బు సంచులతో దొరికిన ఓటుకు నోటు దొంగ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ కంటే గొప్పగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏమున్నదో చెప్తే బాగుండేదని మంత్రి సూచించారు.
వరంగల్ డిక్లరేషన్ ప్రకటన హస్యాస్పదమన్న ఆయన.. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కరెంట్ లేక రైతులు అరిగోస పడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కలపాలని రాష్ట్ర సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్ గ్రామాల ప్రజలు కోరుతున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏ ఒక్క సక్కదనం లేకపోగా... ఏ మొహం పెట్టుకొని ఇక్కడ మాట్లాడుతున్నారని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. కూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తీస్తాడట అని ఎద్దేవా చేశారు. రైతుల కోసం ఏం చేయాలో రాహుల్ నోట పలికించిన ఘనత కేసీఆర్‌దే అన్న ప్రశాంత్ రెడ్డి... రైతు పక్షపాతి ఎవరో యావత్తు దేశ రైతాంగానికి తెలుసని వ్యాఖ్యానించారు. తెలంగాణలో చెప్పిన మాటలు దమ్ముంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చెప్పాలని, అమలు చేసి చూపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎజెండాగా చేర్చాలని కోరారు.
రైతుల పక్షాన పార్లమెంట్లో ఏ రోజూ మాట్లాడని రాహుల్ గాంధీ.. నేడు అల్లా ఉద్దీన్ అద్భుత దీపం చేస్తా అంటే తెలంగాణ ప్రజలు ఎవరూ నమ్మరని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. పొలిటికల్ టూరిస్టులకు కేసీఆర్ భయం పట్టుకుందని, మనుగడ కష్టమనే పార్టీలకు అతీతంగా తెలంగాణ మీద రాజకీయ మిడతల దండు దండయాత్ర చేస్తోందని మండిపడ్డారు. చావుకు సిద్ధపడ్డ కేసీఆర్ తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకుంటారని... తెలంగాణ విషయంలో అడ్డుపడాలని చూస్తే దేశవ్యాప్తంగా అగ్గి పుట్టిస్తారని అన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడి సేవలు దేశానికి అవసరమని ప్రజలు, మేధావులు కోరుతున్నారన్న ఆయన... రాజకీయ టూరిస్టుల మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. ఎప్పుడు కర్రు కాల్చి వాత పెట్టాలో తెలిసిన విజ్ఞులు తెలంగాణ ప్రజలని ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: