సికింద్రాబాద్ లాలాపేటలో తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 3 మాసాలు నిల్వ ఉండే లీటర్ టెట్రా పాల ప్యాకెట్‌ను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. విజయ డెయిరీ నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులు విక్రయించేందుకు వీలుగా పర్యావరణహిత బ్యాటరీతో నడిచే ఈ-కార్ట్స్ వాహనాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా విజయ సహా కరీంనగర్, ముల్కనూరు, మదర్ డెయిరీలకు పాలు పోసే రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేసి 1.60 లక్షల రూపాయల రుణ పరపతి కల్పించనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ జంట నగరాల్లో ప్రముఖ దేవాలయాలు, సందర్శనీయ క్షేత్రాల వద్ద 500 విజయ డెయిరీ అవుట్‌లెట్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులు, జిల్లా కేంద్రాల్లో మరో 500 అవుట్‌లెట్లు తెరవాలని సూచించారు. విజయ డెయిరీని దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు ఉద్యోగులు, సిబ్బంది కంకణబద్ధులై పనిచేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఛైర్మన్ లోక భూమారెడ్డి, ఎండీ శ్రీనివాసరావు, స్థానిక కార్పొరేటర్ పాల్గొన్నారు.