ధాన్యం రవాణాలో జాప్యం జరగకుండా వీలైనన్ని ఎక్కువ వాహనాలు రవాణాకు వాడుకోవాలని అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. మిల్లులకు ధాన్యం వచ్చిన వెంటనే అన్‌లోడ్ చేయాలన్నారు. హైదరాబాద్‌లోని నివాసం నుంచి.. ధాన్యం కొనుగోళ్లు, ఇతర ఇబ్బందులపై సంబంధిత అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని.. చిన్న చిన్న తప్పిదాల వల్ల వచ్చిన నష్టంతో ప్రభుత్వంపై ఆరోపణలు చేయవద్దని మంత్రి కోరారు. క్రాప్ బుకింగ్‌లో నమోదు కాలేదన్న సాకుతో.. ధాన్యం కొనుగోలుని నిలిపి వేయోద్దని అధికారులను ఆదేశించారు. ఆయా సమస్యలపై త్వరలో శాఖాపరమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రైస్ మిల్లుల్లో స్థల సమస్య ఉంటే.. ధాన్యాన్ని పక్క మిల్లు, గోదాంలకు పంపించాలని ఆయన సూచించారు. ప్రకృతి విపత్తుల వల్ల జరిగే నష్టాలను నివారించలేమని చెప్పుకొచ్చారు.
కొనుగోలు కేంద్రాల్లో.. తరుగు తీసే విషయంలో తరచూ ఫిర్యాదులు వస్తున్నాయంటూ... కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు వాటిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. హమాలీల సమస్యలను తీర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పలు జిల్లాల నుంచి మొక్కజొన్న కొనుగోళ్ల కోసం విజ్ఞప్తి వస్తోన్న దృష్ట్యా.. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
కరోనా నివారణకు వైద్య సిబ్బంది కృషి అమోఘమన్న మంత్రి.. వైరస్ లక్షణాలున్న వారు చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఇంటింటి సర్వేలు కచ్చితంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు శృతి ఓఝా, వెంకట్రావు, శర్మన్, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వరరెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, వీఎం అబ్రహం తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: గంగానదిలో తేలిన 50మృతదేహాలు.. ఏం జరిగింది?