Telangana Govt Indiramma Housing Scheme APP : రాష్ట్రంలో పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ సిద్ధం చేశారు. నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో రెండేసి చొప్పున పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్ ద్వారా దరఖాస్తుదారుల వివరాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకపోవడంతో అధికారికంగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇళ్ల పథకంపై స్పెషల్ ఫోకస్ : ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్లను స్వీకరించిన సంగతి తెలిసిందే. రేపు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఇళ్ల పథకం యాప్‌ను ఆవిష్కరించనున్నారు. ఏడాది ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత నెలలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం చెప్పినా, ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే కారణంగా పెండింగ్లో పెట్టారు. ఇప్పుడు సీఎం చేతుల మీదుగా యాప్ ప్రారంభించగానే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం కానుంది.
ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ : ఈ యాప్‌లో దరఖాస్తుదారు పేరు, ఆధార్ సంఖ్య, సొంత స్థలం ఉందా? ఆదాయం ఎంత? గతంలో ఏదైనా గృహ పథకంలో లబ్ధి పొందారా? అనే విషయాలపై 30-35 ప్రశ్నలు ఉంటాయి. ఇళ్లులేని వారి వద్దకు వెళ్లి అధికారులు ఆయా వివరాలను యాప్‌లో నమోదు చేస్తారు. వాటి ఆధారంగా ఈ పథకానికి ఆయా దరఖాస్తుదారులు అర్హులా? కాదా? అనేది తెలుస్తుంది.
తొలి విడతగా నియోజకవర్గానికి 3500 నుంచి 4000 ఇళ్లు : మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుంది. ఈ విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠంగా 4.50 లక్షల ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించుకుంది. గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు. దీంట్లో దివ్యాంగులకు, ఆదివాసీలకు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు తెలిపారు. రెండో విడతలో ఇంటి స్థలం లేనివారికి అవకాశం కల్పించనున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ డేట్ వచ్చేసింది - సీఎం చేతుల మీదుగా ఆరోజే శ్రీకారం
ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి గుడ్న్యూస్ - త్వరలోనే ప్రభుత్వ మోక్షం!