Wife Saved Husband From Cyber Digital Arrest in Zaheerabad : 'మీ బ్యాంకు అకౌంట్ నుంచి భారీ అక్రమాలు జరిగాయి. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం. విచారణకు సహకరించండి' అంటూ ఈడీ, పోలీసు అధికారుల పేరిట ఓ ప్రైవేటు ఉద్యోగిని వీడియో కాల్‌లో సైబర్ నేరగాళ్లు భయభ్రాంతులకు గురి చేశారు. ఇదంతా చూస్తున్న ఆయన భార్య చాకచక్యంగా వ్యవహరించి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి, దుండగుల కుట్రను భగ్నం చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జహీరాబాద్ పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి (50)కి మంగళవారం ఉదయం ప్రభుత్వ బ్యాంకు అధికారి ఆకాశ్ శర్మ పేరిట ఓ వ్యక్తి కాల్ చేశాడు. 'మీ బ్యాంకు ఖాతా నుంచి ముంబయిలో రూ.1.68 లక్షల నగదు చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయి. ఈడీ, పోలీసులు మిమ్మల్ని విచారిస్తారు, వారికి సహకరించడం' అంటూ ఫోన్ కట్ చేశారు. అలా కట్ చేసి వెంటనే వీడియో కాల్ ద్వారా ముంబయి ఎస్పీ ప్రదీప్ నంటూ మరో వ్యక్తి ప్రత్యక్షమయ్యారు. కదలకుండా కూర్చోవాలని, మీ భార్యను పిలవాలని, ఎక్కడికీ వెళ్లకుండా ఇంటి తలుపులు మూసేసి ఉండాలని షరతులు విధించారు. దాదాపు అరగంట సేపు నానా ప్రశ్నలు వేసి ఆయనకు చెమటలు పట్టించాడు. అనుమానం వచ్చిన బాధితుడి భార్య, నీళ్లు తాగి వస్తానని చెప్పి మరో తలుపు నుంచి బయటకు వచ్చి డయల్-100కి ఫోన్ చేసి జరుగుతున్న విషయమంతా చెప్పారు.
సైబర్ కేటుగాళ్ల 'డిజిటల్ అరెస్టు' అస్త్రం - కొత్తవారు కనిపిస్తే బాధితుల్లో కలవరం
పది నిమిషాల్లో రంగంలోకి : వెంటనే స్పందించిన పట్టణ ఎస్సై స్థానిక సైబర్ వారియర్ రషీద్‌తో పాటు సిబ్బందిని సదరు ఇంటికి కేవలం 10 నిమిషాల్లో పంపించారు. వారిని గమనించిన సైబర్ కేటుగాడు 'ఎవరొచ్చారు, ఎందుకొచ్చారు' అంటూ ముఖం కనిపించకుండా వెంటనే ముఖం దాచుకుని మాట్లాడటం మొదలుపెట్టాడు. పోలీసులు పక్క నుంచి బాధితుడికి సూచనలు చేస్తూ నిందితుడి వివరాలు రాబట్టాలని ప్రయత్నించారు. ఇది పసిగట్టిన నిందితుడు వెంటనే కాల్ కట్ చేశాడు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. డిజిటల్ అరెస్టులు, విచారణ పేరిట కాల్స్ వస్తే ఎవరూ నమ్మవద్దని సూచించారు. వీడియో కాల్‌లో పోలీసులు, ఈడీ అధికారులు అరెస్టులు చేయరని తెలిపారు.
ఈ ఒక్క సూత్రం పాటించారంటే - మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయలేరు
ఏపీకే ఫైళ్లను పంపిస్తారు - క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ చేస్తారు