రాష్ట్రంలో రుణమాఫీ(loan waived) ప్రక్రియ కొనసాగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి(Niranjan reddy) తెలిపారు. ఆరో రోజు రూ.63.05 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని వెల్లడించారు. 20,663 మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ చేశామన్నారు. ఇప్పటివరకు 94,695 మంది ఖాతాల్లో రూ.275.31 కోట్లు జమ చేయగా... ఈ ప్రక్రియ ఆగస్టు నెలాఖరు వరకు కొనసాగుతుందని వివరించారు.
ఈ నెల 30 వరకు 6.08 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తామని తెలిపారు. కరోనా విపత్తులో ఆహారం అందించింది అన్నదాతలేనని మంత్రి ప్రశంసించారు. రైతుబంధు(rythu bandhu), బీమాతో(rythu bheema) రైతుల కుటుంబాల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని అభిప్రాయపడ్డారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రం ఆవిర్భవించిన వెంటనే సాగునీరు, ఉచితంగా 24 గంటల కరెంటు సరఫరాపై దృష్టి సారించారు. అందుకే ఏడేళ్లలో దేశానికి అన్నపూర్ణగా నిలిచే స్థాయికి తెలంగాణ ఎదిగింది. అరక దున్నే రైతన్న ఆర్థిక స్థిరత్వం సాధించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటల సాగు మీద అన్నదాతలు దృష్టి సారించాలి.
-నిరంజన్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
ఇదీ చదవండి: HARISH RAO: 'భాజపా హయాంలో దేశం బంగ్లాదేశ్‌తో కూడా పోటీపడలేకపోతోంది'