కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రం ఏకపక్షంగా గెజిట్ విడుదల చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. తెలంగాణ ప్రజల జీవితాలను బలిపెట్టే విధంగా కేంద్రం చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. నిర్దిష్ట కాల వ్యవధిలో నీటి పంపకాలకు ట్రైబ్యునల్ చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు.
నదీ జలాల అంశం తెలంగాణ ప్రజల జీవన్మరణాల సమస్యగా నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో నదీ పరివాహక ప్రాంతం, జనాభా అధికంగా కలిగి ఉన్నామన్న ఆయన... రాష్ట్రానికి అన్ని అవకాశాలు ఉన్నా నీటిని పొందలేని దుస్థితిలో ఉన్నట్లు ఆవేదన వెలిబుచ్చారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కేంద్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు.
రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన ఉద్యమం ప్రధానంగా నీళ్లను ఇతివృత్తంగా చేసుకున్నది. తెలంగాణ బతుకంతా నీళ్ల చుట్టే తిరిగింది. నీళ్లు లేకనే అల్లాడింది. నీళ్ల కోసమే పోరాడింది. రాష్ట్రం వచ్చాకా నీళ్లు తెచ్చుకోవడమే ప్రధాన పనిగా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ కేంద్రం అవలంభిస్తున్న తీరు ఇప్పుడు మేల్కొని ఎప్పుడో చేయవల్సిన పని ట్రైబ్యునల్‌ను ఒక నిర్దిష్ట కాలవ్యవధిలో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాన్ని పూర్తి చేయడానికి చర్యలు తీసుకోమంటే.. ఆపని చేయకుండా అవసరమైన పని చేయకుండా.. రెండు నదుల మీద ఉండేటటువంటి యాజమాన్యపు హక్కులను ప్రాజెక్టులను కాల్వలను పవర్ స్టేషన్లను అన్నింటిని మా పరిధిలోకి తీసుకుంటామనే విధంగా ఇవాళ కేంద్రం గెజిట్ విడుదల చేయడమనేది ప్రత్యక్షంగా తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకోవడమే.
గతంలో యూపీఏ సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగా తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్లు గోస పడింది. సుధీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణలో సమృద్ధిగా నీళ్ల తోటి శాశ్వతంగా కరువును పారదోలి అద్భుతమైన పంటలను పండించి దేశం ఆర్థిక పురోభివృద్ధిలో తెలంగాణ ఒక ప్రత్యేక దశ వచ్చేటప్పటికీ మన సంతోషం మనకు ఉండకుండా వీళ్లు మోకాళ్లు అడ్డువేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఒక్క ప్రాజెక్టు కూడా చేయూతనివ్వకుండా ఒక్క ప్రాజెక్టును తన బాధ్యతగా కేంద్రం తీసుకుని స్పాన్సర్ చేయకుండా తెలంగాణ తనమానాన తాను కష్టపడుతుంటే సహకరించకుండా గెజిట్‌ను విడుదలచేయడమనేది దారుణం. ఇది రాజ్యాంగ విరుద్ధం.
-- నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
ఇదీ చదవండి : Etela Rajender: భాజపా నేత ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభం