కరోనా కారణంగా గతేడాది బోనాల పండుగను నిర్వహించలేకపోయినప్పటికీ... ఈసారి ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్ ఎంసీహెచ్‌ఆర్‌డీలో మంత్రులు... అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్, రాచకొండ సీపీ మహేష్ భగవత్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ తదితరులు హాజరయ్యారు.
పండుగ ఘనంగా జరిగేలా చూడాలి..
ప్రభుత్వమే బోనాలకు నిధులు కేటాయించి నిర్వహిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సమావేశంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి... బోనాల పండుగ ఘనంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జులై 13న గోల్కొండలో ప్రభుత్వ లాంఛనాలతో బోనాల వేడుకలను నిర్వహిస్తామని మంత్రి తలసాని చెప్పారు. వేడుకలకు శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజలందరూ కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని మంత్రి సూచించారు.
బోనాల నిర్వహణకు 15 కోట్ల నిధులు
బోనాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. వేడుకల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలను ఆలయ కమిటీలకు వివరిస్తామన్నారు. అలాగే బోనాల పేరిట ఎవరూ చందాలు వసూలు చేయొద్దని... ప్రభుత్వమే 15 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: గర్భిణులపై మూడో దశ కరోనా ప్రభావం చాలా తీవ్రం