Mallareddy on IT Raids: తమ ఆస్తులు, వ్యాపారాలకు సంబంధించిన అన్ని లెక్కలు, ధ్రువపత్రాలు సరిగ్గానే ఉన్నాయని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఐటీ అధికారులకు అన్ని విధాల సహకరిస్తున్నామని పేర్కొన్నారు. కళాశాలలు, ఆసుపత్రులు, ఆస్తుల వివరాలను స్పష్టంగా ఐటీ అధికారులకు వివరించినట్లు ఆయన చెప్పారు. అధికారులు ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారన్న ఆయన.. వారికి అన్ని విధాలా సహకరిస్తున్నామన్నారు. ఐటీ సోదాలకు సంబంధించి తన కుమారులకు, తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.
గురువారం ఉదయానికల్లా ఐటీ సోదాలు ముగిసే అవకాశం ఉందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఐటీ అధికారుల సోదాలు ముగింపు దశకు చేరుకున్నట్లు ఆయన వెల్లడించారు. కళాశాలలు, ఆసుపత్రులు, ఆస్తుల విషయంలో ఎలాంటి అవకతవకలు లేవని న్యాయబద్ధంగా తమ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని అనుమతులతోనే కళాశాలలు, ఆసుపత్రులు నిర్వహిస్తున్నామన్నారు.
మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు : తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని ఐటీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తాలు వసూలు చేసినట్టు గుర్తించారు. అదనంగా వసూలు చేసిన మొత్తాలను నగదు రూపంలో తీసుకున్నట్టు ఆధారాలు సేకరించినట్టు ఐటీ వర్గాలు తెలిపాయి. అనధికారికంగా, లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో వసూలు చేసిన మొత్తాలను స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు, మల్లారెడ్డి-నారాయణ ఆసుపత్రి కోసం వెచ్చించినట్టు పేర్కొన్నారు.
ఇప్పటి వరకు చేసిన సోదాల్లో రూ.6కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్ రీజియన్ పరిధిలోని ఐటీ అధికారులతో పాటు ఒడిశా, కర్ణాటక నుంచి వచ్చిన 400 మందికి పైగా ఐటీ అధికారులు, సిబ్బంది 65 బృందాలుగా ఏర్పడి సోదాలు చేశారు. కొన్ని చోట్ల సోదాలు ముగిశాయి. మరికొన్ని చోట్ల రాత్రికి ముగిసే అవకాశముందని, ఇంకొన్ని చోట్ల రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు ఐటీ వర్గాలు వెల్లడించాయి. స్థిరాస్తులను కూడా వాస్తవ విలువ కాకుండా తక్కువ చూపినట్టు.. ఆధారాలు సేకరించామని పేర్కొన్నారు. మల్లారెడ్డి వియ్యంకుడు వర్ధమాన కళాశాలలో డైరెక్టర్‌గా ఉండటంతో అక్కడ కూడా సోదాలు చేసినట్టు వెల్లడించారు.
ఇవీ చదవండి: