లాక్డౌన్ తర్వాత విద్యాసంస్థలను తిరిగి తెరిచేందుకు అనుసరించాల్సిన విధానాలపై వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల రూపొందించిన పోస్ట్ లాక్డౌన్ రీస్టార్ట్ మాన్యువల్‌ను ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ప్రగతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నతవిద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, కళాశాల యాజమాన్యం, ప్రతినిధులు పాల్గొన్నారు. రీస్టార్ట్ మాన్యువల్ విద్యార్థులకు కరదీపికగా ఉపయోగపడుతుందన్న కేటీఆర్.. విద్యార్థులు, తల్లిదండ్రులు, పరిసర ప్రాంతాల్లోని వివిధ వర్గాల ప్రజలకు కళాశాలలు, విశ్వవిద్యాలయాలు తగిన సహకారం ఇవ్వాలని కోరారు.
కరోనాకు సరైన మందు, టీకాలేని సమయంలో నివారణ, ఉపశమనం మాత్రమే మన చేతుల్లో ఉన్నాయని అన్నారు. ప్రభుత్వాలు ఇచ్చే సలహాలను అన్ని కళాశాలలు పాటించి తమ విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం చర్యలు తీసుకుని తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాలని ఉన్నతవిద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి అన్నారు. ప్రధానమంత్రి సూచించిన సప్తపది, తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సమాజానికి చేరువయ్యేలా కరదీపికను రూపొందించినట్లు విజ్ఞానజ్యోతి సంస్థ అధ్యక్షులు డీఎన్.రావు తెలిపారు. ఉత్తమ సామాజిక ప్రభావాన్ని సాధించాలన్న తపనలో భాగంగానే మాన్యువల్‌ను రూపొందించినట్లు సంస్థ ప్రధాన కార్యదర్శి హరిశ్చంద్రప్రసాద్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి : శాసనసభ, మండలి సమావేశాలపై నేడు కేసీఆర్ సమీక్ష