తెరాస శ్రేణులతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఓటరు నమోదు ఇంఛార్జిలతో పలు అంశాలపై చర్చించారు. అక్టోబర్ 1 నుంచి జరగబోయే పట్టభద్రుల ఓటర్ల నమోదునకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని కార్యకర్తలకు సూచించారు.
పంచాయతీ నుంచి శాసనసభ దాకా అన్ని ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించిందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి తెరాస ప్రభుత్వ పాలన ఫలాలు అందుతున్నాయని వివరించారు. ఇప్పటికే సుమారు లక్ష ఉద్యోగాలను భర్తీ చేశాం, ప్రైవేట్ రంగంలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 15 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించామని ప్రకటించారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా పాలన సంస్కరణలు చేపట్టామని.. అరవై ఏళ్ల ఫ్లోరైడ్ రక్కసిని ఆరేళ్లలో తరిమేశామని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని.. ప్రతిపక్షాలే దివాలా తీశాయని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఎజెండా దొరకని పరిస్థితి ఉందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి : గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం