VRA Posts regularization in Telangana: గ్రామ రెవెన్యూ సహాయకుల ఉద్యోగాల క్రమబద్ధీకరణ అంశంపై పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు బుధవారం మరో విడత చర్చలు జరిపినట్లు తెలిసింది. వీఆర్‌ఏ ఐకాస నాయకులను ప్రగతిభవన్‌కు పిలిపించి పెండింగ్ అంశాలపై కొంతసేపు వారితో మాట్లాడినట్లు సమాచారం. రాష్ట్రంలో ఉన్న 22 వేల మందికి పైగా వీఆర్‌ఏలు ఉద్యోగ క్రమబద్ధీకరణ, పే స్కేలు, వారసత్వ ఉద్యోగాల కల్పన కోరుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఈ ఏడాది జులై 25 నుంచి అక్టోబరు 12వ తేదీ వరకు నిరవధిక సమ్మెను నిర్వహించారు.ఈ విషయంలో మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌లు ఇప్పటికే రెండుసార్లు వీఆర్‌ఏలతో సమావేశమయ్యారు.
మునుగోడు ఉపఎన్నిక అనంతరం మరోమారు చర్చించి సమస్యను పరిష్కరిస్తామని సూచించారు. గత నెలాఖరున ప్రభుత్వ సూచన మేరకు తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ట్రెసా) ప్రతినిధులు పెండింగ్ సమస్యలపై ఒక నివేదికను అందజేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోమారు చర్చలకు పిలిచినట్లు వీఆర్‌ఏలలో చర్చ జరుగుతోంది. అయితే, చర్చలకు వెళ్లిన ప్రతినిధులు ఏ విషయం చర్చించారనే విషయాన్ని ఇతర నాయకులకు వివరించకపోవడంతో ఏం జరుగుతుందోననే కలవరంలో ఉన్నారు.
ప్రాతిపదిక ఏమిటో?: వీఆర్‌ఏలలో డైరెక్ట్ రిక్రూట్ అయిన వారు 2500 మంది, ఉద్యోగ క్రమబద్ధీకరణకు విద్యార్హత ఉన్నవారు దాదాపు ఎనిమిది వేల మంది ఉన్నారు. మరోవైపు వారసులకు తమ స్థానాన్ని వారసత్వ బదిలీ కింద అప్పగించాలనుకునే వారు కూడా వేల మంది ఉన్నారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారం ప్రారంభిస్తే ఏయే అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటుందోననే మీమాంస వారిలో కనిపిస్తోంది. మరోవైపు ఒకటి రెండు రోజుల్లో సీఎం వద్దకు వీఆర్‌ఏ ప్రతినిధులను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది.
వాటాబందీపై కలెక్టర్ల కసరత్తు: గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేస్తున్న వారిలో వాటాబందీ విధానంలో (వాటాదారులు) ఎంతమంది ఉన్నారనే అంశంపై కలెక్టర్లు వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు పలుజిల్లాల్లో కలెక్టర్లు బుధవారం 18 అంశాలతో కూడిన ప్రొఫార్మాను తహసీల్దార్లకు పంపారు. కొన్ని గ్రామాల్లో కొన్ని కుటుంబాలకు చెందిన వారు ఏడాదికి ఒకరు చొప్పున వీఆర్‌ఏలుగా విధులు నిర్వరిస్తున్నారు. ఉద్యోగాల క్రమబద్ధీకరణ నేపథ్యంలో వీరిలో ఎవరిని పరిగణనలోకి తీసుకుంటారనేదానిపై స్పష్టత లేకపోవడంతో రెవెన్యూశాఖ మండలాల నుంచి సమాచారాన్ని కోరినట్లు తెలిసింది.
ఇవీ చదవండి: