రక్షణ, ఎయిరోస్పేస్ రంగాల్లో ఎదిగేందుకు రాష్ట్రంలో అద్భుత అవకాశాలున్నాయని.. ఈ రంగాల్లో మరిన్ని పెట్టుబడులకు కంపెనీలు ముందుకు రావాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. హైదరాబాద్‌లో టాటా బోయింగ్ డిఫెన్స్ ఎయిరోస్పేస్ కంపెనీ విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. టాటా బోయింగ్ హైదరాబాద్ ఫెసిలిటీలో తయారైన వందో AH- 64 అపాచి ఫ్యుజ్‌లాజ్ డెలివరీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తక్కువ సమయంలోనే ఈ మైలురాయిని అందుకున్న సంస్థగా కేటీఆర్(KTR) అభినందించారు. డిఫెన్స్, ఎయిరో స్పేస్ అంకుర సంస్థలకు, ఎంఎస్‌ఎంఈ(MSME)లకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని... ఈ రంగంలో ఏడు ప్రత్యేక పారిశ్రామిక వాడలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు.
మెరుగైన వసతులు
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి తెలిపారు. బెంగళూరు కంటే హైదరాబాద్‌లోనే మెరుగైన వసతులు ఉన్నాయని పేర్కొన్నారు. డీఆర్‌డీవో, బీడీఎల్, ఈసీఐఎల్ హైదరాబాద్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. బీఈఎల్, హెచ్ఏఎల్ వంటి ఎన్నో సంస్థలకు హైదరాబాద్ నిలయమని వివరించారు. ఏరోస్పేస్ సరఫరా గొలుసుకు హైదరాబాద్ అనుకూలమని మంత్రి అభిప్రాయపడ్డారు.
రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) వంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా భావన. అంతర్జాతీయ ప్రమాణాలు గల నైపుణ్యాల, శిక్షణ కేంద్రంగా దాన్ని అభివృద్ధి చేయొచ్చు. ఇక్కడి అవసరాలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ సంస్థలకు అవసరమయ్యే అద్భుత నైపుణ్యం గల ఉద్యోగులను తయారు చేయొచ్చు. మనం కలిసి పనిచేస్తే ఇది తప్పకుండా సాధ్యమని నేను నమ్ముతాను. రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు తెలంగాణ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఈ రంగం కోసం రాష్ట్రంలో ఏడు ప్రత్యేక పారిశ్రామిక వాడలను నెలకొల్పాం.
-కేటీఆర్, మంత్రి
ఇదీ చదవండి: Corona Hotspot : మరో కరోనా హాట్‌స్పాట్‌గా హుజూరాబాద్ నియోజకవర్గం