ktr letter to central minister: తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణి సంస్థ అద్భుతంగా అభివృద్ధి ప్రస్థానంలో ముందుకు పోతోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి సంస్థను ఉద్దేశ్యపూర్వకంగా చంపే కుట్రకు కేంద్రం తెరలేపిందన్నారు. సింగరేణి సంస్థను బలహీనపరిచి, నష్టపూరిత పబ్లిక్ సెక్టార్ కంపెనీగా మార్చి అంతిమంగా ప్రైవేటుపరం చేసే కుట్రను కేంద్ర సర్కారు అమలు చేస్తోందన్నారు. నిన్న నల్లచట్టాలతో రైతులను నట్టేట ముంచే కుట్ర చేసిన కేంద్ర ప్రభుత్వం.. నేడు నల్ల బంగారంపై కన్నేసి సింగరేణిని నిలువునా దెబ్బతీసే కుతంత్రం చేస్తోందని విమర్శించారు. సింగరేణిలో ఉన్న జేబీఆర్‌ఓసీ-3, కేకే -6 , శ్రవణపల్లి ఓసీ, కోయ గూడెం గనులను సింగరేణి సంస్థకు కేటాయించకుండా వాటికోసం వేలంలో పాల్గొనాలని నిర్దేశించడంపైన మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్రం గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశారు.
సింగరేణిలో గత ఏడేళ్లలో 450 లక్షల టన్నుల ఉత్పత్తి నుంచి 670 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగిందని.. అంతే కాకుండా బొగ్గు తవ్వకాలు, రవాణా, లాభాలు, కంపెనీ విస్తరణ విషయంలోనూ సింగరేణి గణనీయమైన ప్రగతిని సాధిస్తూ వస్తోందని మంత్రి అన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న ధర్మల్ విద్యుత్ కేంద్రం దేశంలోనే అత్యుత్తమ పీఎల్‌ఎఫ్‌ను కలిగి ఉండడమే కాకుండా.. దక్షిణాది రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు భారీ ఎత్తున బొగ్గు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్ధ ఇవ్వని విధంగా 29 శాతం లాభాల్లో వాటాను ఇస్తున్న ఏకైక సంస్థ సింగరేణి మాత్రమేనన్నారు.
అదే ప్లాన్...
ఏపీలోని వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు కావాల్సిన ఐరన్ ఓర్ గనులు ఇవ్వకుండా నష్టాలకు గురిచేసి... ఇదే విధంగా ప్రైవేటుపరం చేసేందుకు రంగం సిద్ధం చేసిందని ఆరోపించారు. ఇప్పటికే కేంద్రం వద్ద స్టీల్‌ప్లాంట్‌కు చెందిన 27 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని.. సరిగ్గా ఇలాంటి కుట్రలనే సింగరేణిపై ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ధ్వజమెత్తారు. మరోవైపు గుజరాత్లో మాత్రం అడిగిన వెంటనే లిగ్నైట్ గనులను ఎలాంటి వేలం లేకుండా గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ సంస్ధకు కేటాయించారు. అదే విధంగా తెలంగాణలోని సింగరేణికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ దేశంలోని రాష్ట్రం కాదా.. అక్కడో విధానం.. ఇక్కడో విధానం ఏంటని నిలదీశారు. ఇది తెలంగాణ రాష్ట్రంపై వివక్షగా అభివర్ణించారు.
అదే జరిగితే..
ఇప్పటి వరకూ 16 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని.. సింగరేణి కోల్‌మైన్ ఉద్యోగాల కల్పనలో గోల్డ్‌మైన్. గనులు మూతపడే కొద్దీ ఉద్యోగాలూ పోతాయి. సింగరేణిని కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. అంతిమంగా సింగరేణి సంస్థ సమీప భవిష్యత్తులో కనుమరుగైపోతుందని... అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక పురోగతి ప్రమాదంలో పడుతుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం సింగరేణిలోని కేవలం నాలుగు బ్లాకులు మాత్రమే వేలం వేయడం లేదని, వేలాది మంది కార్మికుల భవిష్యత్తును బహిరంగ మార్కెట్లో వేలం వేస్తోందని విమర్శించారు. సింగరేణిని కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ ఆలోచనలు ఇప్పటికైనా మానుకోకపోతే సింగరేణి కార్మికులు మరోసారి ఉక్కుపిడికిళ్లు బిగించడం ఖాయమని, కేంద్రంలోని భాజపాను వెంటపడి తరమడం ఖాయమని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : Siddipet Robbery Case Accused Arrest : సిద్దిపేట దోపిడీ కేసులో ఇద్దరు అరెస్టు.. రూ.34 లక్షలు రికవరీ