హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ స్పర్శ్ హాస్పిస్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు వరప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. ఖాజాగూడ వద్ద ఎకరా విస్తీర్ణంలో స్పర్శ్ హాస్పిస్ కొత్త భవనాన్ని నిర్మించారు. ఎకరా స్థలాన్ని 33 ఏళ్లపాటు ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. మృత్యు ముంగిట్లోని రోగులకు స్పర్శ్ హాస్పిస్‌లో ఉచిత వైద్య సేవలు అందించనున్నారు.
ఈ ఆస్పత్రి ద్వారా వేలాది మందికి సాంత్వన కలుగుతుంది. అధునాతన భవనంలో పూర్తి వసతులతో 82 పడకలు ఏర్పాటు చేశారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా 10 పడకలు ఏర్పాటు చేశారు. స్పర్శ్ హాస్పిస్‌లో డాక్టర్లు, 30 మందికిపైగా నర్సింగ్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. ఏపీతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి రోగులు వచ్చి చికిత్సలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 4 వేల మంది రోగులకు స్పర్శ్ హాస్పిస్ సేవలందించింది.
గతంలో పాలియేటివ్ కేర్ అంటే ఏంటో తెలియదు. పాలియేటివ్ కేర్ గురించి తెలుసుకుంటే గొప్పగా అనిపించింది. స్పర్శ్ హాస్పిస్‌కు మంచి భవనం రావడం సంతోషకరంగా ఉంది. కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే ఆత్మసంతృప్తి ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు మనసుకు హాయిగా ఉంటుంది. రోటరీ క్లబ్ ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వ తన సహకారం అందిస్తోంది. స్పర్శ్ హాస్పిస్‌కు నీటి, విద్యుత్, ఆస్తిపన్ను రద్దు చేస్తాం.
-మంత్రి కేటీఆర్
ప్రపంచంలో అనేక రకాల సేవలు ఉంటాయి. కానీ మనిషికి అవసాన దశలో చేసే సేవే నిజమైన సేవ. చివరి మజిలీలో ఆత్మీయ స్పర్శ, పలకరింపు కావాలి. చివరి మజిలీలో సేవలు అందిస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు. స్పర్శ్ లాంటి ఆస్పత్రులకు నీటి, విద్యుత్, మున్సిపల్ బిల్లుల నుంచి మినహాయింపులు ఇవ్వాలి.
-శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు వరప్రసాద్‌రెడ్డి
ప్రతి మాట వింటాం
ఆసుపత్రిలో బతుకు పోరాటం చేసి ఆఖరిదశకు చేరిన రోగులకు ఇక్కడ సేవలు అందిస్తారు. ఇంట్లో ఉంచి సేవలు చేసేందుకు అనువుగా లేని పేద, మధ్యతరగతి కుటుంబాలకూ సాంత్వన చేకూరుతోంది. చివరి క్షణంలో అనుభవించే మనోవేదన నుంచి బయట పడేయటం, మనసును తేలికపరచటమే తమ లక్ష్యమంటున్నారు డాక్టర్ ఆంజనేయులు. ఆ సమయంలో పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఇవన్నీ గుర్తుకొస్తాయి. సమస్యలు చిన్నవైతే దాతల సాయంతో పరిష్కరిస్తున్నట్లు ఆయన చెప్పారు. క్షణాలు లెక్కబెడుతూ ఉన్న వారు ఎంతో మాట్లాడాలని ప్రయత్నిస్తారు. ఇప్పుడు వినకపోతే రేపు ఆ గొంతు వినపడదు. అందుకే.. ఓపికగా వింటామని డాక్టర్ వివరించారు.
ఇదీ చూడండి: Sparsh Hospice: ఆఖరి ఘడియల్లో ఆత్మీయ హస్తం... స్పర్శ హాస్పిస్