దేశం గర్వించదగ్గ చేనేత కళాకారులు తెలంగాణ రాష్ట్రం సొంతమని మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేత రంగంలో విశిష్ట సేవలందించి జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న కొలను పెద్ద వెంకయ్య, కొలను రవీందర్, గజం భగవాన్.. మెరిట్ సర్టిఫికెట్ విజేతలు సాయిని భరత్, దుద్యాల శంకర్, తడక రమేష్ గార్లను చేనేత మంత్రి కేటీఆర్ అసెంబ్లీలోని తన ఛాంబర్లో ఘనంగా సన్మానించారు.
తమ వృత్తి నైపుణ్యంతో రాష్ట్రానికి గొప్ప పేరు ప్రఖ్యాతి తెచ్చిన అవార్డు గ్రహీతలకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ.. వారికి ప్రభుత్వపరంగా ప్రోత్సాహం ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చేనేత పథకాల వల్ల చేనేత రంగం అభివృద్ధి చెందుతుందని, చేనేత కళాకారుల సంక్షేమం కొరకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎల్.రమణ, తెరాస అధికార ప్రతినిధి కర్నాటి విద్యాసాగర్, జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న నేత, తదితరులు పాల్గొన్నారు.
![చేనేత కళాకారులను సన్మానించిన మంత్రి కేటీఆర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13256400_ktr.jpg)
చేనేత కార్మికులకు అరుదైన గౌరవం
ఇటీవలే యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి(Bhudan Pochampally) చేనేత కళాకారులకు(National Award for Handloom workers) అరుదైన గౌరవం దక్కింది. చేనేత రంగంలో కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక నేషనల్ మెరిట్ సర్టిఫికెట్ అవార్డులకు భూదాన్‌పోచంపల్లి వాసులు ఎంపికయ్యారు. తడక రమేష్, సాయిని భరత్‌లకు కేంద్రం ఈ అవార్డు ప్రకటించింది.
చేనేత రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి కేంద్ర సర్కారు సంత్ కబీర్ అవార్డు, నేషనల్ అవార్డు, నేషనల్ మెరిట్ సర్టిఫికెట్ అవార్డు, కమలాదేవి ఛటోపాధ్యాయ అవార్డులను అందజేస్తుంది. ఈ నేపథ్యంలో చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్, డిజైన్ అభివృద్ధి విభాగాల్లో వారు అవార్డులకు ఎంపికయ్యారు.
ఇదీ చదవండి: Telangana CM KCR : 'తెలంగాణ పర్యాటక ప్రగతిని పరుగులు పెట్టిస్తాం'