Minister KTR Asked Questions to Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) ప్రశ్నలు సంధించి.. సవాల్ విసిరారు. యువతను రెచ్చగొట్టి.. చిచ్చుబెట్టాలని చూస్తున్న రాజకీయ నిరుద్యోగి రాహుల్‌గాంధీ అని వ్యాఖ్యానించారు. దేశంలో గత పదేళ్లల్లో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఏదైనా ఉందా అని సూటిగా ప్రశ్నించారు. తొమ్మిదిన్నరేళ్లలో 2,2,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 1,60,083 నియామకాలు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వమని.. ఈ లెక్క తప్పని నిరూపించగలవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారం వెలగబెట్టిన పదేండ్ల కాలంలో (2004-14) తెలంగాణలో భర్తీ చేసిన ఉద్యోగాలు(Telangana Job Notifications) ఎన్ని? కేవలం 10,116 మాత్రమే కాదా? ఇదేనా నిరుద్యోగులపై ప్రేమ అంటూ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. మా ప్రభుత్వం ఏడాదికి సగటున నింపిన కొలువులు 16,850.. అదే కర్ణాటకలో 100 రోజుల్లో 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రగల్భాలు ఏమయ్యాయని నిలదీశారు. 6 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెపుతావా.. వాగ్దానం చేసి యువతను వంచించలేదా.. మీరు రాజ్యం ఏలుతున్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీ హామీ మరిచి నిరుద్యోగులను ముంచింది నిజం కాదా అంటూ ఎదురుదాడి చేశారు.
KTR Fires on Rahul Gandhi : అదే కాంగ్రెస్ హయాంలో ఏటా ఇచ్చింది కేవలం 1012 జాబులు! ఇదీ మీకూ మాకూ ఉన్న తేడా మీరొచ్చి మాకు సుద్దులు చెబితే ఎట్లా అంటూ కేటీఆర్ విమర్శించారు. జీవితంలో ఎప్పుడైనా ఉద్యమం చేశావా? ఉద్యోగం చేశావా? యువత ఆశలు ఆకాంక్షలు తెలుసా? పోటీ పరీక్షలు రాసినవా? ఇంటర్వ్యూకు వెళ్లావా? ఉద్యోగార్థుల ఇబ్బందులు ఏమన్నా అర్థమైతయా రాహుల్ గాంధీ(Rahul Gandhi) అని ధ్వజమెత్తారు. 95 శాతం ఉద్యోగాలు స్థానిక బిడ్డలకే దక్కేలా కొత్త జోనల్ వ్యవస్థ తీసుకొచ్చిన నిబద్ధత మాది.. మా కొలువులు మాకే దక్కాలన్న ఉద్యమస్ఫూర్తి నిలబెట్టి నియామకాల నినాదం నిజం చేసిన వాస్తవాన్ని కాదనగలవా రాహుల్ అని అన్నారు.
1972లో సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు(Mulki Rules) సమర్థిస్తూ తీర్పునిస్తే పార్లమెంట్‌లో చట్టంచేసి రద్దు చేసి తెలంగాణ స్థానికత హక్కులకు సమాధి కట్టింది మీ పార్టీ కాదా అంటూ కేటీఆర్ ఆరోపించారు. 6 సూత్రాలు.. 610 జీవోలు.. గిర్ గ్లానీ నివేదకలు తుంగలో తొక్కి హైదరాబాద్ ఫ్రీ జోన్‌గా మార్చేసి స్థానికేతర కోటాలు పెట్టి తెలంగాణ యువతకు దక్కాల్సిన కొలువులు కొల్లగొట్టి తీరని అన్యాయం చేసిన ద్రోహులు మీరు కాదానని మండిపడ్డారు. మీ పనికి మాలిన పాలనలో ఉపాధి, ఉద్యోగాల్లేవని నిరాశ నిస్పృహలతో యువత తుపాకులు చేతబట్టి అడవిబాట పట్టి నక్సలైట్లలో చేరింది నిజమా.. కాదా అంటూ ప్రశ్నించారు.
Telangana Election Polls 2023 : వేల మంది యువకుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపి ఎన్‌కౌంటర్ల పేరిట నిత్యం నెత్తుటేర్లు పారించిన కర్కశమైన పాలన మీది కాదా అంటూ అన్నారు. 2004లో తెలంగాణకు ఇచ్చిన మాటతప్పి పదేండ్లు కాలయాపన చేసి వందల మంది యువత ఆత్మబలిదానాలకు కారణమైన నేరం మీదికాదా అంటూ ప్రశ్నించారు. సోనియాను బలిదేవతని మీ పీసీసీ ప్రెసిడెంటే చెప్పింది అబద్ధమా అంటూ ఎద్దేవా చేశారు. మీరు ప్రకటించిన పసలేని జాబ్ క్యాలెండర్ ఒక పచ్చి మోసం కాదా? ఎన్నికల కోడ్ అమల్లో ఉండే 2024 మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఉద్యోగ నోటిఫిషన్లు ఎట్లా సాధ్యం.. యువతను మభ్యపెట్టి నాలుగు ఓట్లు వేయించుకునే నాటకం తప్ప చిత్తశుద్ధి ఏమైనా కనిపిస్తుందా అంటూ భగ్గుమన్నారు. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ముందా... రాహుల్ గాంధీ.. అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
తెలంగాణ ఇచ్చేటప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు : రాహుల్ గాంధీ
సమైక్య వాదులంతా ఒక్కటై తెలంగాణ మీద దండెత్తడానికి వస్తున్నారు : హరీశ్ రావు