రంగారెడ్డి జిల్లా బాలాపూర్ సమీపాన ఉన్న పహాడీ షరీఫ్‌లోని పురాతన దర్గా హజ్రత్ బాబా షరీఫుద్దీన్ సాయబ్ వద్ద అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ.. సీసీరోడ్డు, ర్యాంపు, మోటరబుల్ ట్రాక్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఫోర్ వీలర్ వాహనాలు గుట్టపైకి వెళ్లేందుకు రోడ్డు, పార్కింగ్ స్థల నిర్మాణం కోసం రూ.9.60 కోట్లను 2017లో ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. ఈ పనులను రాష్ట్ర ఈడబ్ల్యూఐడీసీకి అప్పగించామని చెప్పారు.
దర్గా వద్ద ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని మంత్రి పేర్కొన్నారు. అదే విధంగా మౌలాలి దర్గా వద్ద ర్యాంపు నిర్మాణాన్ని జీహెచ్ఎంసీకి అప్పగించినట్లు తెలిపారు. మౌలాలి వద్ద ర్యాంపు కోసం కోటి 87 లక్షలు మంజూరు చేశామని స్పష్టం చేశారు. అన్ని మతాలను గౌరవించడంతో పాటు ఆయా మతాల విశ్వాసాలకు సంబంధించిన మసీదులు, చర్చిలు, ఆలయాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. అందుకు అనుగుణంగానే నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు.
ఇదీ చూడండి: 'అప్పులతో కాదు.. సంపదను పెంచుతూ అభివృద్ధి చేయండి'