ముఖ్యమంత్రి కేసీఆర్పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి కొప్పుల ఈశ్వర్ తప్పుపట్టారు. మంత్రులు గంగులతో కలిసిన ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. 2003లో ఈటల తెరాసలో చేరారని... ఆయన చేరక ముందే ఉద్యమం ఉద్ధృతంగా ఉందని వెల్లడించారు. ఈటల రాజేందర్ విమర్శల్లో వాస్తవం లేదని తెలిపారు. ఈటల కంటే ముందు చాలామంది పార్టీకి సేవ చేశారని స్పష్టం చేశారు. ఈటలను గౌరవించి పార్టీలో సముచిత స్థానం కల్పించారని చెప్పారు. ఈటలను అన్ని విధాల కేసీఆర్ గౌరవించి ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ సహా కీలక మంత్రిత్వశాఖలు ఇచ్చారని వ్యాఖ్యానించారు.
విమర్శలు చేయడం సరికాదు
ఈటల ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిందో అర్థం కావట్లేదని మంత్రి కొప్పుల అన్నారు. గతంలో ప్రభుత్వ పథకాలపై కూడా ఈటల విమర్శలు చేశారని వెల్లడించారు. రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని ప్రకటించారు. దేశమంతా తెలంగాణ వైపే చూస్తోందని తెలిపారు. పార్టీ ద్వారా అనేకరకాలుగా ఈటల రాజేందర్ లబ్ధి పొందారని వివరించారు. అసైన్డ్‌భూములను వ్యాపార విస్తరణ కోసం కొనుగోలు చేసినట్లు ఈటలే చెప్పారని వెల్లడించారు.
సీఎంపై దాడి చేయడం తగదు
ఈటల రాజేందర్... ఎస్సీలు, పేదలు, బీసీల గురించి మాట్లాడతారు. పేదలకు చెందిన భూములను ఎందుకు తీసుకున్నారు? ఎకరానికి రూ.6 లక్షలు ఇచ్చి కొనుగోలు చేసినట్లు ఈటల చెప్పారు... ఈటల కొనుగోలు చేసిన భూముల విలువ కోటి నుంచి కోటిన్నర వరకు ఉంటుంది. విలువైన భూములను తక్కువ ధరకు ఎందుకు కొనుగోలు చేశారు? దేవరయాంజల్‌లో దేవాలయ భూములను కూడా కొనుగోలు చేశారు. దేవాలయ భూములని తెలిసి కూడా ఎందుకు కొనుగోలు చేశారు?. మీకు ఏదో అన్యాయం జరిగిందని సీఎంపై దాడి చేయడం తగదు. - మంత్రి కొప్పుల ఈశ్వర్.
అదే ఈటల ధ్యేయమా?
ఈటల గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం జరగలేదని కొప్పుల మాట్లాడారు. పార్టీని విచ్ఛిన్నం చేసే విధంగా పలుసార్లు ఈటల మాట్లాడారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడమే ఈటల ధ్యేయమా? అని ప్రశ్నించారు. ఏంలేని స్థాయి నుంచి గొప్పగా తెలంగాణను కేసీఆర్ తీర్చిదిద్దారని గుర్తు చేశారు. సీఎంపై ఈటల విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఇదీచూడండి: తెలంగాణ భవన్ నుంచి ప్రత్యక్ష ప్రసారం