గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'భారతమాత మహా హారతి' కార్యక్రమాన్ని నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గోమాత, భారత మాత విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, మాడ్గుల నాగపణిశర్మ, స్వామి పరిపూర్ణానంద, లక్ష్మణ్, రఘునందన్ రావు, రాం చందర్ రావుతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై భారతమాతకు మహా హారతి ఘట్టాన్ని తిలకించారు.
భారతమాత ఫౌండేషన్ ద్వారా ఏటా ఇలాంటి మహత్కర కార్యాన్ని చేపట్టడం గొప్ప విషయమని సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కొనియాడారు. ఈ బాధ్యత నిర్వర్తించే అవకాశం కిషన్ రెడ్డికి దక్కడం.. చూసే అవకాశం మనకు దక్కడంతో మనమంతా ధన్యులమయ్యామన్నారు. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వాతంత్య్రమందామా అని రాసిన తనే ఓ కొత్త మార్పుని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో చూస్తున్నానని తెలిపారు. త్రివిధ దళాల శక్తి ప్రతి భారతీయుడికి ప్రతి ఏటా గణతంత్ర దినాన తెలుస్తుందని స్వామి పరిపూర్ణానంద అన్నారు. కాశీ ద్వారా 2022లో మరో గణతంత్రాన్ని మోదీ సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: విజయ డెయిరీ మరో అడుగు.. ఐస్క్రీం ఉత్పత్తులు