Jagadishreddy in New Jersey: ప్రపంచవ్యాప్తంగా ఏ జాతికి లేని సాంస్కృతిక వారసత్వం ఒక్క తెలంగాణాకు మాత్రమే సొంతమని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. భిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలను కలిగి ఉండడం మన అదృష్టమని తెలిపారు. అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణా అమెరికా తెలుగు సంఘం మేఘా కన్వెన్షన్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి ప్రారంభించారు. టీటా ప్రతినిధి ఫైళ్ల మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ప్రపంచంలో ఎన్నో జాతులు వచ్చిపోయాయని.. ప్రస్తుతం ఉన్న మూడు వేల పైచిలుకు జాతులలో ఒక్క తెలంగాణలో మాత్రమే ప్రకృతిని ఆరాధించే అద్భుతమైన బతుకమ్మ సంప్రదాయం ఉందని మంత్రి తెలిపారు. బతుకమ్మ వారసత్వాన్ని కొనసాగించే బాధ్యత నేటి తరం మీదే ఉందన్నారు. వారసత్వంగా వచ్చిన సంస్కృతి సంప్రదాయాలను వర్తమానానికి అందించే విషయంలో ప్రవాసులు ముందు వరుసలో ఉండాలని సూచించారు. బతుకమ్మతో పాటు బోనాలు, గ్రామదేవతల పేరుతో నిర్వహించే జాతరల ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు.
ఎన్నో వ్యయ, ప్రయాసాలకు ఓర్చి తెలంగాణ ఉనికిని చాటేందుకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ముందుకుపోతున్న తెలంగాణా అమెరికా తెలుగు సంఘాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి అభినందించారు. ప్రవాసులు పుట్టి పెరిగిన చోట ఇప్పటికీ ప్రభుత్వ సేవలు అందని పక్షంలో అక్కడ సేవలు అందించేందుకు ప్రవాసులు ముందుకు రావాలని మంత్రి సూచించారు. అనంతరం మంత్రిని తెలంగాణా అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
భాజపా దేశానికే ప్రమాదం: భాజపాతో దేశానికి ప్రమాదమని.. కాంగ్రెస్ మునిగిపోయే పడవ అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. తెలంగాణా అమెరికా తెలుగు సంఘం చివరి రోజున తెరాస పార్టీ నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో దేశాన్ని నాశనం చేసిందన్నారు. ఆ పార్టీ దిక్కు లేనిది అయిపోయిందని.. ఫలితం ఇప్పుడు అనుభవిస్తోందని ధ్వజమెత్తారు. మోదీ సర్కార్‌తో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బ తిన్నాయని.. భాజపా పాలనలో దారిద్య్రం పెరిగిందని ఆరోపించారు. యావత్ భారతదేశం ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు చూస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.