Indrakaran Reddy Meeting With Wildlife Board: వన్యప్రాణుల దాడుల్లో సంభవించే మరణాలతో పాటు పంట నష్టం పరిహారాన్ని పెంచాలని రాష్ట్ర వన్యప్రాణి మండలి ప్రతిపాదించింది. మరణించిన వారికి ప్రస్తుతం ఇస్తున్న రూ.5 లక్షల పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర వన్యప్రాణి మండలి సమావేశమైంది. ఈ భేటీలో పలు అంశాలు, ప్రతిపాదనలపై చర్చించింది.
అడవుల రక్షణ, వన్యప్రాణి సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను సమావేశంలో పీసీసీఎఫ్ డోబ్రియాల్ వివరించారు. రాష్ట్రంలో మొదటిసారి చేపట్టిన కవ్వాల్ టైగర్ రిజర్వ్ పులుల ఆవాసాల్లో ఉన్న రెండు గ్రామాల తరలింపు ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని తెలిపారు. స్థానిక ప్రజలు, వన్యప్రాణులకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని నిరోధించేందుకు అవసరమైన చర్యలపై సమావేశంలో చర్చించారు. పులులు, వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన వారికి ఇచ్చే పరిహారాన్ని పెంచాలని నిర్ణయించారు.
సాధారణ గాయాలైతే రూ.లక్ష లోపు వాస్తవ వైద్యం ఖర్చు, తీవ్రంగా గాయపడితే రూ.3 లక్షలకు మించకుండా వైద్యానికి అయ్యే ఖర్చు, పెంపుడు జంతువులు చనిపోతే రూ.50 వేలకు మించకుండా వాస్తవ అంచనా ఇవ్వాలని ప్రతిపాదించారు. పంట నష్టానికి ప్రస్తుతం ఎకరాకు రూ.6 వేలు ఉన్న పరిహారాన్ని రూ.7,500 పెంచాలని, పండ్ల తోటలకు గరిష్ఠంగా రూ.50 వేల వరకు ఇవ్వాలని కమిటీ ప్రతిపాదించింది.
హైదరాబాద్ వనస్థలిపురంలో బస్ టెర్మినల్ నిర్మాణానికి వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. హరిణ వనస్థలికి చెందిన 1.354 హెక్టార్ల అటవీ భూమి నిబంధనలకు అనుగుణంగా బదలాయింపునకు అనుమతి ఇచ్చారు. జాతీయ రహదారిలో విపరీతంగా పెరిగిన రద్దీ, ప్రయాణీకుల సౌకర్యం కోసం ఈ టెర్మినల్ నిర్మాణం కానుంది. హరిణ వనస్థలి కోసం అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని బోర్డు నిర్ణయించింది.
శ్రీశైలం రహదారి విస్తరణ కోసం వచ్చిన ప్రతిపాదనను మాత్రం బోర్డు తిరస్కరించింది. అమ్రాబాద్‌లోని వన్యప్రాణి సంరక్షణను దృష్టిలో పెట్టుకుని దీన్ని తిరస్కరించినట్లు తెలిసింది. కడెం ప్రాజెక్టు పరిధిలో లక్ష్మీపూర్ ఎత్తిపోతల, నాగార్జున సాగర్ పరిధిలో పెద్దగుట్ట ఎత్తిపోతల పనులు, ఇతర రహదారులు, కేబుల్ పనులకు వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. వన్యప్రాణులు ప్రమాదంలో పడ్డప్పుడు కాపాడేందుకు అవసరమైన రెస్క్యూ బృందాల సంఖ్యను పెంచాలని సమావేశంలో నిర్ణయించారు.
ఇవీ చదవండి: కామారెడ్డి మాస్టర్ ప్లాన్.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
దుబ్బాక నియోజకవర్గానికి నిధుల అంశం.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ రూట్ మ్యాప్.. మినీ మేనిఫెస్టో సిద్ధం!