ఆంధ్ర వలసవాదం సుడిగాలిలో తెలంగాణ అస్తిత్వస్పృహ ఆరిపోకుండా ఉండటానికి ఎందరో కృషి చేశారు. 1969 ఉద్యమం అణగారిపోయిన తరవాత ఎప్పటికైనా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించగల మరో నాయకుడు ఉద్భవించగలడా అని ఆశగా ఎదురు చూశారు.
ఆ నమ్మకం వమ్ము కాలేదు. గులాబీ జెండాను చేత పూనిన ఒక ధీరోదాత్తుడు ఆవిర్భవించి తెలంగాణను విముక్తం చేశాడు. రెండు దశాబ్దాలుగా తెలంగాణ జనం కలలోను, మెలకువలోను జపిస్తున్న మూడక్షరాల పేరు- కేసీఆర్!
స్వప్నం సాకారం!
అందరూ చరిత్ర నుంచి ప్రభావితమవుతారు. కొందరే చరిత్రను ప్రభావితం చేస్తారు. తెలంగాణ సమాజాన్ని ఊగించి, ఉరికించి, దీవించి, శాసించి విజయతీరం చేర్చారు కేసీఆర్. ఆయన ఉన్నత వ్యక్తిత్వం ముందు, ఆయన ఉక్కు సంకల్పం ముందు, ఆయన వ్యూహ చతురత ముందు- ఆ విధి సైతం తలవంచింది. తెలంగాణ ఆవిర్భవించింది గులాబీ జెండా సంపన్న వర్గాలు, కులాల అధికార వాంఛలో పుట్టలేదు. వెనకబడిన తెలంగాణ వేదనలో పుట్టింది. అచంచల దీక్షతో సిద్ధాంత బలంతో ముందుకు ఉరికింది.
సుశిక్షితులైన కార్యకర్తలే పునాదిగా పురోగమించింది. ధనబలం ఉన్న పార్టీలను జనబలంతో ఎదిరించింది. మఘలో పుట్టి పుబ్బలో పోతుందని అవహేళన చేసిన పార్టీలను అదృశ్యం చేసింది. స్వరాష్ట్ర స్వప్నం సాకారం చేసింది. ఇది చరిత్రకందని అద్భుతం.
డిప్యూటీ స్పీకర్ పదవి మొదలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, రాష్ట్ర మంత్రి, కేంద్రమంత్రి వంటి పదవులను ప్రజల ఆకాంక్ష కోసం తృణప్రాయంగా వదిలిన ఘన చరిత్ర తెరాస సొంతం. ఆ త్యాగమే పార్టీని ప్రజలకు దగ్గర చేసింది. భావజాల ప్రచారం, ఉద్యమ కార్యాచరణ, రాజకీయ సమరం అనే మూడు కోణాల్లో కేసీఆర్ పార్టీని నడిపించిన తీరు అనితర సాధ్యం.
టీఆర్‌ఎస్ ప్రస్థానం ప్రారంభమైన రోజున దేశంలో అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకం. పద్నాలుగేళ్ల పోరాటం తరవాత దాదాపు అన్ని పార్టీలు అనుకూలం. వ్యవస్థలేవైనా తెలంగాణకు అనుకూలంగా మారవలసిన అనివార్యతను సృష్టించిన రాజకీయ యోధుడు కేసీఆర్.
ఈ ప్రయత్నంలో ఆయనకు ఆచార్య జయశంకర్ తోడుగా నిలిచారు. తెలంగాణ ఏర్పాటును వాయిదా వేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరి ఒకవైపు, ఉద్యమాన్ని దెబ్బతీయాలనే తెలుగుదేశం ఇంకోవైపు. ఈ రెండింటిని మట్టి కరిపించి టీఆర్‌ఎస్ అజేయంగా నిలిచింది. అడుగడుగునా అడ్డుపడే సైంధవులను ఓడిస్తూ, కేసీఆర్ ఉద్యమాన్ని విజయతీరం చేర్చారు.
విజయాన్ని అందరూ సొంతం చేసుకుంటారు. అపజయం ఎప్పుడూ అనాథ. జయాపజయాలను సమంగా స్వీకరించిన స్థిరచిత్తుడు కేసీఆర్. రాళ్ళు విసిరిన చేతులే ఒకనాడు పూలు చల్లుతాయనే నమ్మకంతో ఆయన ముందడుగు వేశారు.
తిట్టిన నోళ్లే పొగిడే స్థాయిలో, ఆకాశమంత ఎత్తుకు పార్టీని పెంచారు. ఇందుకోసం ఆయన కఠోర క్రమశిక్షణ పాటించారు. అందరికీ అది అలవాటు చేశారు. అధ్యయన శీలత అంటే ఏమిటో, రాజకీయ నాయకుడికి అది ఎంత అవసరమో ఆయన నిరూపించారు.
పార్టీలో ప్రతి ఒక్కరు ప్రజల సమస్యలను అధ్యయనం చేసేలా, వివిధ వేదికల మీద ప్రతిభావంతంగా వాదన వినిపించగలిగేలా నాయకులను, కార్యకర్తలను తయారు చేశారు.ఆయన అడుగుజాడలో పార్టీలో బలమైన నాయకత్వం ఎదిగింది.
సమర్థ నాయకత్వమే బలం
రాజకీయ నాయకులు సాధారణంగా రాజకీయ సంబంధాలకే పరిమితమవుతారు. టీఆర్‌ఎస్ పార్టీకి పౌర సమాజంతో సంబంధాలు నెలకొల్పడంలో కేసీఆర్ కొత్త ఒరవడి నెలకొల్పారు. ఆయన మేధావుల్లో మేధావి, కవుల మధ్య కవి, కళాకారులతో ఉంటే కళాకారుడు.
పత్రికా సంపాదకులకు, పాత్రికేయులకు, ఉద్యోగులకు, కార్మికులకు, కర్షకులకు... ఇలా అందరికీ పార్టీతో ఉద్యమ సంబంధం ఆయన వల్ల కలిగింది. విద్యార్థి ఉద్యమానికి దిశానిర్దేశం చేశారు. బిందువుగా ప్రారంభమైన పార్టీ నేడు సింధువుగా మారింది. గులాబీ జెండా ఒక పార్టీ జెండాగా కాకుండా తెలంగాణ జెండాగా మారడానికి కర్తగా కేసీఆర్ నిలిచారు. కర్మ క్రియలుగా కార్యకర్తలు నిలిచారు.
రెండు దశాబ్దాల్లో రెండు లక్ష్యాలు సాకారమయ్యాయి. మొదటి లక్ష్యం తెలంగాణ సాధన పూర్తయ్యింది. రెండో లక్ష్యం బంగారు తెలంగాణ నిర్మితమవుతోంది. ఉద్యమాన్ని ఎంత నిబద్ధతతో నడిపించారో, ప్రభుత్వాన్ని అంతే నిబద్ధతతో నడిపిస్తున్నారు.
కేసీఆర్‌కు ప్రజలే ఊపిరి. ప్రజలకు ఆయనే దిక్సూచి. తెలంగాణ ఆయనలో నూతన భవిష్యత్తును దర్శిస్తోంది. ఆయన ఆలోచనల వెలుగులో, ఆయన వలె నిష్కామకర్మ సాగిస్తూ, టీఆర్‌ఎస్‌ను ప్రజల పార్టీగా నిలబెట్టడానికి ప్రతి కార్యకర్త పునరంకితం కావాలి.
రెండు దశాబ్దాల ఘనచరిత్రను సగర్వంగా స్మరించుకుంటూ... ఈ వార్షికోత్సవ శుభవేళ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నానని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సత్యమే దైవంగా, సేవయే మార్గంగా, త్యాగమే ఆభరణంగా, తెలంగాణ సమగ్ర నిర్మాణమే ధ్యేయంగా, సమతా భారతమే లక్ష్యంగా కేసీఆర్ నాయకత్వంలో మరో ఉజ్జ్వల ప్రస్థానాన్ని కొనసాగిద్దాం.. గుండె గుండెలో గులాబీ పూవులు పూయిద్దామని అన్నారు.
ఇదీ చదవండి: సుజల దృశ్యం.. సీఎం కేసీఆర్‌తో సాక్షాత్కారం: కేటీఆర్