minister harish rao on new medical colleges: వరంగల్లో నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సహా ఎనిమిది వైద్యకళాశాలల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. కొత్త వైద్యకళాశాలల నిర్మాణంపై వైద్య- ఆరోగ్య, ఆర్ అండ్ బీ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆర్కిటెక్టులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకొందన్న హరీశ్ రావు... త్వరగా పూర్తి చేస్తే ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందుతాయని అన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం కళాశాలలు ఉండాలన్న ఆయన... భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునేలా కూడా నిర్మాణాలు ఉండాలని సూచించారు. స్థలం వృథా కాకుండా, అన్ని వసతులు ఉండేలా నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పారు.
ప్రతి పేద బిడ్డకు జిల్లా పరిధిలోనే నాణ్యమైన వైద్య సేవలు అందాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కలను సాకారం చేసేందుకు పనులు వేగవంతం చేయాలని హరీశ్ రావు స్పష్టం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో లక్ష్యాన్ని చేరుకుంటున్న తరుణంలో విద్య, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. పల్లె దవాఖానాల ద్వారా గ్రామీణులకు ఎంబీబీఎస్ వైద్యుల సేవలు, వైద్యకళాశాలల ద్వారా సమీపంలోనే సూపర్ స్పెషాలిటీ వైద్యుల సేవలు అందుతాయని మంత్రి అన్నారు. దీంతో ప్రాథమిక దశలోనే రోగాలకు చికిత్స అందించడం, ఆపత్కాలంలో వెంటనే టెర్షియరీ కేర్ సేవలు అందించడం సాధ్యమవుతుందని హరీశ్ రావు తెలిపారు.
ఇదీ చదవండి: