Harish Rao on Telangana Decade Celebrations : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేయనున్నట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌లు, వైద్యాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలు, సబ్ సెంటర్ల నిర్మాణ, మరమ్మతు పనులు వేగవంతం చేయాలని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
ఇప్పటికే సిద్ధమైన బస్తీ, పల్లె దవాఖానాలు వెంటనే ప్రారంభించాలని హరీశ్‌రావు ఆదేశించారు. ఈ క్రమంలోనే కంటి వెలుగు కార్యక్రమంపై ఆరా తీసిన మంత్రి.. 80 రోజుల్లో కంటి వెలుగు ద్వారా 1.50 కోట్ల మందికి స్క్రీనింగ్ నిర్వహించడం గొప్ప విషయమంటూ సంబంధిత అధికారులకు అభినందనలు తెలిపారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుంచి 21 రోజుల పాటు వైభవోపేతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. రోజుకు ఒక రంగం చొప్పున 21 రోజుల పాటు ఆయా రంగాల వారీగా తెలంగాణ తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని చాటేలా కార్యక్రమాలు ఉండాలని సీఎం ఆదేశించారు. అందుకు అనుగుణంగా అన్ని శాఖలు తమ శాఖల పరంగా చేయాల్సిన కార్యక్రమాలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. వాటిని సీఎం కేసీఆర్ పరిశీలించారు.
ప్రతిపాదనలు రెడీ..: రైతు వేదికల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని వ్యవసాయ శాఖ కోరింది. అంగన్ వాడీలు, మహిళా సమాఖ్యల వద్ద కార్యక్రమాలు చేపట్టాలని మహిళా-సంక్షేమ శాఖ, గురుకులాల వద్ద కార్యక్రమాలు చేపట్టాలని సంక్షేమ శాఖలు ప్రతిపాదించాయి. మిగతా శాఖలు కూడా ప్రతిపాదనలు రూపొందించాయి. ఈ క్రమంలోనే 'ఆరోగ్య శాఖ డే' రోజున న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేయాలని ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు నిర్ణయించారు.
నేడు మరోమారు సీఎం సమావేశం..: ఇదిలా ఉండగా.. మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు కార్యాచరణ ప్రణాళికపై కసరత్తు చేస్తున్నారు. మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మరోమారు సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై చర్చించి ఉత్సవాల ప్రణాళికను ఖరారు చేయనున్నారు.
ఉత్సవాల లోగో విడుదల..: మరోవైపు.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన లోగోను సీఎం కేసీఆర్ సోమవారం రోజున విడుదల చేశారు. ఈ లోగోలో దశాబ్ది ఉత్సవాల్లో పది సంఖ్యకు ప్రాధాన్యతనిచ్చారు. పది సంఖ్యలోని ఒకటిలో తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ, బోనాల చిత్రాలను పొందుపరిచారు. పుష్పం ఆకారంలోని సున్నా నమూనా మధ్యలో తెలంగాణ తల్లి చిత్రపటాన్ని డిజైన్ చేశారు.
ఇవీ చూడండి..
Telangana Decade Celebrations తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై నేడు ప్రణాళిక విడుదల
CM KCR Review : 'దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో గొప్పగా సాగాలి'