Arrangements Of BRS Sabha in Khammam: దేశంలో 18 లక్షల పోస్టుల ఖాళీలుంటే కేంద్ర ప్రభుత్వం వాటిని భర్తీ చేయడం లేదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. అందుకే యువత ఉద్యోగాలిచ్చే బీఆర్‌ఎస్ కావాలో? ఉద్యోగాలు తీసేసే బీజేపీ కావాలో? ఆలోచించి ఎంచుకోవాలని ఆయన సూచించారు. ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ పనులను అధికారులతో కలిసి పరిశీలించిన ఆయన.. దేశ చారిత్రాత్మక సభకు ఖమ్మం వేదిక కావడం అదృష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఒక్కప్పుడు ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్ నేడు జాతీయపార్టీగా రూపాంతరం చెందిందని హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలు చేసే పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని ఆరోపించిన ఆయన.. రాష్ట్రంలో అమలు చేసే మిషన్ భగీరథను కేంద్ర ప్రభుత్వం దేశమంతా విస్తరిస్తోందని తెలిపారు. మిషన్ కాకతీయను అమృత్ సరోవర్ పేరుతో అమలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
రైతు బంధును కేంద్రం కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే నేడు తెలంగాణ ఆచరించింది.. రేపు దేశమంతా అనుసరిస్తోందని వ్యాఖ్యానించారు. గ్రామాలకు అవార్డులు ఇస్తే 10కి పది తెలంగాణకు వచ్చాయని మంత్రి గుర్తు చేశారు. మతతత్వ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని సూచించిన ఆయన.. మతతత్వ పార్టీలకు ఎవరైనా ఓటేస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీని సాగనంపితేనే ప్రభుత్వ రంగ సంస్థలకు మనుగడ ఉంటుందని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు.
"తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు స్థానం లేదు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి డిపాజిట్లు కూడా రావు. ఎవరైనా బీజేపీ గురించి ఆలోచిస్తే గోతిలో పడ్డట్టే. కేంద్రం సింగరేణిని అప్పుల కుప్పలోకి నెట్టింది. సింగరేణిని కార్పొరేట్లకు అప్పగించడమే కేంద్రం ధ్యేయం. బీజేపీని దెబ్బతీస్తేనే ప్రభుత్వ సంస్థల్ని కాపాడుకోగలం. పరిపాలన చేతకాదన్న వాళ్ల నోళ్లు కేసీఆర్ మూయించారు. జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిష్టను కేసీఆర్ పెంచుతున్నారు".- హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి
ఇవీ చదవండి: