Minister gangula review on paddy procurement: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హైదరాబాద్‌లో మంత్రి తన నివాసంలో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, డిప్యూటీ కమిషనర్ రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.
ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు, రైతుల ఇబ్బందులు, ఇతర అంశాలపై విస్తృతంగా చర్చించారు. గత సంవత్సరం కన్నా ఈ ఏడాది ఇదే రోజు వరకు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా సేకరించామని అన్నారు. గత ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో నవంబరు నెలలో 25.84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే తాజాగా నవంబరు మాసంలో దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువగా సేకరించినట్లు తెలిపారు.
వ్యవసాయ అనుకూల విధానాలు, పుష్కలమైన నీరు లభ్యతల దృష్ట్యా ఈసారి ధాన్యం నాణ్యత మరింత పెరిగిందని మంత్రి గంగుల అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా మారిందని చెప్పారు. ప్రైవేట్‌లో కనీస మద్దతు ధర కన్నా అధికంగా ధర రావడం మంచి పరిణామమని తెలిపారు. ఈ డిసెంబరు మాసంలో జరుగుతున్న వరి పంట కోతలకు అనుగుణంగా ధాన్యం సేకరణ వేగవంతంగా జరిగేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకూ 9.52 లక్షల గన్నీ బ్యాగులు వాడామని, 9.16 లక్షల గన్నీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికే 729 కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ పూరై మూసివేశామని తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు, మాయిశ్చర్ మిషన్లు, టార్పాలిన్లతోపాటు అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చామని చెప్పారు. రైతులు ఎఫ్ఏక్యూ నిబంధనలకు అనుగుణంగా విధిగా నాణ్యమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మంత్రి గంగుల సూచించారు.