Minister Gangula Review on Paddy Procurement : రాష్ట్రంలో అకాల వర్షాల ప్రభావంతో తడిసిన ధాన్యం కొనుగోలు చేసేందుకు వీలుగా బాయిల్డ్ చేయడానికి జిల్లాలకు ఆదేశాలు జారీ చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం సేకరణపై సచివాలయంలో మంత్రి అత్యవసర ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఇటీవల మునుపెన్నడూ లేని విధంగా కురుస్తున్న అకాల భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ధాన్యం సేకరణ జరుగుతున్న తీరు, కొనుగోలు కేంద్రాల వద్ద తాజా పరిస్థితులు, ఇతర ఇబ్బందులపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని అన్నారు. మొత్తం 1.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సంబంధించి అత్యవసర బాయిల్డ్ రైస్ కోసం ఉత్తర్వులు ఇచ్చామని.. సేకరణ జరుగుతున్న రీతిలో పెంచుతామని తెలిపారు.
వర్షాలతో అత్యధికంగా నష్టపోయిన జిల్లాలైన నల్గొండలో 22 వేల మెట్రిక్ టన్నులు, కామారెడ్డి, సిద్దిపేట్, పెద్దపల్లి, సూర్యాపేట, కొత్తగూడెం జిల్లాలకు 14,706 మెట్రిక్ టన్నులు, నిజామాబాద్ - 14,700, కరీంనగర్ - 7350, యాదాద్రి, జగిత్యాల జిల్లాల్లో 5000 మెట్రిక్ టన్నుల చొప్పున బాయిల్డ్ ఆర్డర్ ఇచ్చామని చెప్పారు. ఇప్పటి వరకూ గత సంవత్సరం యాసంగి కన్నా ఈసారి రెండున్నర రెట్లు అధికంగా ధాన్యం సేకరణ చేశామని అన్నారు.
గత ఏడాది ఇదే రోజున 3.23 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కాగా.. ఇవాళ్టి వరకే 7.51 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరించామని స్పష్టం చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా చేస్తున్నామని, రోజుకు 80 వేల మెట్రిక్ టన్నులకుపైగా సేకరిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకూ 5000 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 40 వేల మంది రైతుల నుంచి 95 వేల లావాదేవీల ద్వారా 7.51 లక్షల మెట్రిక్ టన్నులు వరకు సేకరించామని ప్రకటించారు. వీటి విలువ రూ.1543 కోట్లు అని చెప్పారు. నిధులకు ఎలాంటి కొరత లేదని, రైతుల సౌకర్యార్థం వేగంగా నగదు చెల్లింపులు చేస్తున్నామని మంత్రి గంగుల పేర్కొన్నారు.
ఇవీ చదవండి: