విద్యార్థుల్లో ఉన్న భయాందోళనలను పోగొట్టి వారిని పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో బీసీ గురుకులాలు, వసతి గృహాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
విద్యార్థులను పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం చేయాలని, వారి ఆరోగ్య పరిరక్షణ, పరీక్షల సన్నద్ధతపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని కమలాకర్ అధికారులకు స్పష్టం చేశారు. విద్యార్థుల్లో ఆందోళన తొలగించి.. జాగ్రత్త చర్యలు, భౌతికదూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చూడాలన్న ఆయన... విద్యార్థులందరికీ థర్మల్ స్కానింగ్ చేయడంతో పాటు శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా ఐదుగురు రాష్ట్రస్థాయి ప్రత్యేకాధికారులను నియమించినట్లు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.
"వసతి గృహాల్లో ఇంతకుముందులా ఉండటం కుదరదు. అందుగు తగినట్లుగా చర్యలు తీసుకోవాలి. ప్రతి గురుకులం, వసతి గృహాన్ని వైద్యబృందం సందర్శించాలి. తరగతి గదుల్లో, వసతి గృహాల్లో తరచూ శానిటైజ్ చేయాలి. విద్యార్థులకు నాణ్యమైన పోషక ఆహారం, ప్రతి రోజూ కోడిగుడ్లు, పండ్లు, మల్టీ విటమిన్ మాత్రలు ఇవ్వాలి. పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలి. పరీక్షల మధ్య విరామసమయంలో సంబంధిత విషయ నిపుణుల చేత వారికి తర్ఫీదు ఇప్పించాలి."
-గంగుల కమలాకర్, మంత్రి
ఇదీ చదవండి: జోరుగా తాగుతున్న మందుబాబులు.. రాష్ట్రానికి కోట్లలో ఆదాయం