అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌తో మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి ఈటల వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ప్రొక్యూర్ మెంట్ కమిటీ హెడ్ శ్రీదేవి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు, టీఎస్‌ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్లతో ఫోన్‌లో మాట్లాడారు.
త్వరితగతిన కొనుగోలు...
ఐసోలేషన్ వార్డుల్లో ఉపయోగించే ఎన్-95 మాస్క్‌లు 50 వేలు, పర్సనల్ ప్రొటెక్షన్ ఈక్వివ్‌మెంట్స్ 25 వేలు, లక్ష హ్యాండ్ గ్లౌజులు, రెండు లక్షల ట్రిపుల్ లేయర్ మాస్క్‌లు కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారు. పీహెచ్‌సీలకు అందించేందుకు అవసరమైన శానిటైజర్లు, చికిత్స అందించేందుకు సరిపోయేంత మందులు, థర్మోస్కానర్లు టెండర్లు లేకుండా కొనుగోలు చేయాలని ఈటల పేర్కొన్నారు.
ప్రత్యేక 50 పడకల కేంద్రం ..
గచ్చిబౌలిలో ఏర్పాటు చేస్తున్న 50 పడకల క్వారంటైన్ కేంద్రం వెంటనే అందుబాటులోకి వచ్చేలా చూడాలని మంత్రి కోరారు. విమానాశ్రయంలో ఒక్క మనిషి కూడా తప్పిపోకుండా ప్రతి ఒక్కరినీ తనిఖీ చేయాలని ఆదేశించారు. స్కాట్లాండ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని, నిర్ధారణకై మరోసారి పరీక్ష చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి : తెలుగు రాష్ట్రాల విద్యుత్ సంస్థల్లో మళ్లీ లొల్లి