అభయ హస్తం పథకం కింద అందుతున్న పింఛన్ల తీరు తెన్నులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న ఆసరా పింఛన్లలో అభయ హస్తం పింఛన్ దారులు కూడా ఉన్నారని మంత్రి తెలిపారు.
2009లో అభయహస్తం ప్రారంభమైనప్పుడు 21లక్షల మంది పింఛన్ దారులుండగా, తాజా లెక్కల ప్రకారం అందులో లక్షా 90వేల మందికి మాత్రమే ఆసరా పింఛన్లు రావడం లేదని తేలిందన్నారు. ప్రస్తుతం పింఛన్ దారుల అర్హతా వయసును 65 ఏళ్ల నుంచి 57ఏళ్లకు తగ్గిస్తుండటం వల్ల ఇంకా చాలా మందికి పింఛన్లు వస్తాయని వివరించారు.
అభయహస్తంలో ఉండి ఆసరా పింఛన్లు పొందని వారిని గుర్తించి అందరికీ పింఛన్లు అందేలా చూడాలని మంత్రి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియని సాథ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఉపాధి హామీ పథకం కింద పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మంత్రి అధికారులకు తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమాల్లో అనేక గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య సమస్యలు కనిపించాయన్న ఆయన... మురుగునీటి కాలువలను శుభ్రం చేయడం సమస్యగా మారిందని అన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించిన మంత్రి... వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు పూర్తిగా నిర్మాణం జరిగేలా చూడాలని అన్నారు. హరితహారం కింద సాధ్యమైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలని స్పష్టం చేశారు. ఎండాకాలం మొదలైనందున మెుక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలని తెలిపారు. మెటీరియల్ కాంపొనెంట్ నిధులతో సీసీ రహదార్ల పనులు చేపట్టాలని అధికారులకు మంత్రి చెప్పారు.
ఇదీ చూడండి : 'రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలి'