ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో అరణ్యభవన్‌లో మంత్రి సమీక్షించారు.
చనాకా-కొరాటా, లోయర్ పెన్‌గంగా, ప్రాణహిత, నీల్వాయి, జగన్నాథపూర్, కుమురం భీం, కుప్తి ప్రాజెక్టులు, చెన్నూర్ ఎత్తిపోతల, కాళేశ్వరం ప్రాజెక్టు 27, 28 ప్యాకేజీలు, కడెం ప్రాజెక్ట్ పనులు, చెక్‌డ్యాంల నిర్మాణాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. తమ తమ నియోజకవర్గాల్లోని సాగునీటి అవసరాలు, చేపట్టాల్సిన పనులను ప్రజాప్రతినిధులు వివరించారు. కొన్నిచోట్ల గుత్తేదారులు పనులు నిలిపివేశారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
వెంటనే స్పందించిన మంత్రి పనులు చేయలేని స్థితిలో ఉన్న గుత్తేదార్లను తొలగించి.. ఆ పనులను కొత్తవారికి అప్పగించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణలోకి తీసుకోవాలని, ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారన్న ఆయన.. సమావేశంలో చర్చించిన అంశాలను ముఖ్యమంత్రికి నివేదిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: బడ్జెట్ సమావేశాలు హుందాతనాన్ని ప్రతిబింబించాయి: ప్రశాంత్‌రెడ్డి