Metro train stopped due to technical fault: హైదరాబాదీ ప్రయాణికులను తక్కువ సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వేగంగా గమ్యస్థానాలకు చేర్చే మెట్రో ట్రైన్స్ ఎప్పుడు ఏ సాంకేతిక సమస్యతో ఆగిపోతున్నాయి ఎవరికి తెలియడం లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా అమీర్‌పేట- రాయదుర్గం మార్గంలో మెట్రో రైలు గంట నిలిచిపోయింది.
అమీర్‌పేట – రాయదుర్గం మధ్య ఆ సమయంలో ఒకే మార్గంలో రాకపోకలు సాగాయి. దీనివల్ల మిగతా ట్రైన్స్ కూడా ఆలస్యంగా నడిచాయి. అమీర్‌పేట మెట్రో స్టేషన్లో భారీగా ప్రయాణికులు నిలిచిపోవడంతో స్టేషన్లో రద్దీ నెలకొంది. అధికారులు మెట్రో రాకపోకలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో.. స్టేషన్లో గందరగోళం నెలకొంది. సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రయాణికులు ఆందోళన దిగారు. ఈలోగా అధికారులు సమస్యను పరిష్కరించడంతో.. ట్రైన్స్ సజావుగా నడుస్తున్నాయి.
సోమవారం కూడా సాంకేతిక లోపంతో ఎర్రమంజిల్లో మెట్రో రైలు నిలిచిపోయింది. అందులోని ప్రయాణికులను.. సిబ్బంది మరో రైలులోకి తరలించారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వెళ్తుండగా.. సాంకేతిక సమస్య తలెత్తినట్టు అధికారులు గుర్తించారు. ఆఫీసులకు, వివిధ పనులకు వెళ్లే సమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. దీంతో మియాపూర్- ఎల్బీనగర్ మార్గంలో మెట్రో రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్టుకు మెట్రో సేవలు అందించేందుకు ప్రభుత్వం పనులు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి సుమారు 900 మీటర్ల మేరకు.. స్టేషన్‌ను పొడిగించి అక్కడ ఎయిర్‌పోర్టు మెట్రోస్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు మొత్తం 31 కారిడార్లు నిర్మిస్తున్నారు. ఎయిర్‌పోర్టు మెట్రో గరిష్ఠంగా 120 కి.మీ. వేగంతో వెళ్తూ 31 కి.మీ. దూరాన్ని 26 నిమిషాల్లో చేరుకునేలా ఏర్పాటు చేస్తున్నారు.
ఇవీ చదవండి: